మంగళవారం 19 జనవరి 2021
Telangana - Dec 23, 2020 , 19:22:01

తెలంగాణ ఎర్లీ కోడ‌ర్స్ కు స్కోచ్ అవార్డు

తెలంగాణ ఎర్లీ కోడ‌ర్స్ కు స్కోచ్ అవార్డు

హైద‌రాబాద్ : తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న తెలంగాణ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ అనుబంధ డిజిథాన్‌కు మ‌రోమారు జాతీయ స్థాయిలో గుర్తింపు ద‌క్కింది. డిజిథాన్ ద్వారా నిర్వ‌హించిన తెలంగాణ ఎర్లీ కోడ‌ర్స్ కు స్కోచ్ అవార్డు సొంత‌మైంది. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల‌కు స‌రైన శిక్ష‌ణ అందిస్తే, మ‌ట్టిలోని మాణిక్యాలు ఎలా వెలుగులోకి వ‌స్తారో డిజిథాన్‌ ఆధ్వ‌ర్యంలో అందించిన కోడింగ్ స్కిల్స్ శిక్ష‌ణ రూపంలో స్ప‌ష్టం చేసినందుకు ఈ ప్ర‌తిష్టాత్మ‌క జాతీయ అవార్డు ద‌క్కింది. 69వ స్కోచ్ అవార్డుల్లో ప్ర‌కటించిన ఈ అవార్డును మ‌క్త‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రిచంద‌న స్వీక‌రించారు.

కోడింగ్ స్కిల్స్‌ కు ప్రాధాన్యం నేప‌థ్యంలో యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డెల్లాస్‌, తెలంగాణ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ మ‌ద్ద‌తుతో డిజిథాన్ రాష్ట్రవ్యాప్తంగా బేసిక్ కోడింగ్ శిక్ష‌ణ అందించేందుకు సిద్ధ‌మైంది. 2022 నాటికి ల‌క్ష మందికి కోడింగ్ స్కిల్స్ నేర్పించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. కోడింగ్ స్కిల్స్ శిక్షణ విధానాన్ని ఎంతో ఉత్సాహ‌వంతంగా డిజిథాన్ తీర్చిదిద్ది నారాయ‌ణ‌పేట్ జిల్లాలోని మ‌క్త‌ల్, మాగ‌నూర్, కృష్ణ, వన‌ప‌ర్తి జిల్లా ఆత్మ‌కూరు అమ‌ర‌చింత మండ‌లాల్లో తెలంగాణ ఎర్లీ కోడ‌ర్స్ ప్రాజెక్టు టీటా డిజిథాన్ పూర్తి చేసింది. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల విద్యార్థులు స్మార్ట్‌ ఫోన్ ఓన‌మాలు తెలియ‌ని ద‌శ నుంచి కోడ్ రాసే స్థాయికి తీర్చిదిద్ద‌డం, సొంతంగా గేమ్స్‌, యానిమేష‌న్స్ రూప‌క‌ల్ప‌న చేయ‌డం ఈ శిక్ష‌ణ ల‌క్ష్యం. 

శిక్ష‌ణ ప్రారంభంలో అనేక‌మంది విద్యార్థుల‌కు ``మ్యూట్‌`` అనే ప‌దం, మైక్ వాడ‌కం తెలియ‌ని ఆ విద్యార్థులు ప్ర‌స్తుతం గేమ్స్ డిజైనింగ్‌, యానిమేష‌న్ రూపొందించార‌ని శిక్ష‌కులు మ‌హ‌మ్మ‌ద్ సాజిద్‌, తోట రాజ‌శేఖ‌ర్ పేర్కొన్నారు. ఈ శిక్ష‌ణా కార్య‌క్ర‌మాల‌తో విద్యార్థుల్లో లాజిక‌ల్ థింకింగ్ పెద్ద ఎత్తున పెరిగాయ‌న్నారు. నేష‌న‌ల్ ఎడ్యుకేష‌న్ పాల‌సీలో 6వ త‌ర‌గ‌తి నుంచి కోడింగ్ స్కిల్స్ నేర్పించాల‌ని ప్ర‌తిపాదించారు. ఈ అంశానికి టీటా శిక్ష‌ణ ద్వారా స‌రైన ఫ్రేమ్ వ‌ర్క్‌ దొరికింది. కోడింగ్ స్కిల్స్ శిక్ష‌ణ‌లో భాగంగా ఒక్కో పాఠ‌శాల నుంచి ఒక్కో టీచ‌ర్‌కు, ఇద్ద‌రు విద్యార్థుల‌కు శిక్ష‌ణ అందించారు. జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రిచంద‌న దాస‌రి, డీఈఓ ర‌వీంద‌ర్, అధికారులు స‌హ‌క‌రించారు. 

టీటా గ్లోబ‌ల్ ప్రెసిడెంట్ సందీప్ మ‌క్తాల మాట్లాడుతూ..  హైద‌రాబాద్‌లో టెక్కీ‌లకు‌, వ‌న‌ప‌ర్తి విద్యార్థుల‌కు క్లాస్‌రూం ట్రైనింగ్‌, మ‌క్త‌ల్‌లో ఆన్‌లైన్  శిక్ష‌ణ అందించ‌డం త‌మ‌కు స‌వాల్‌గా నిలిచింద‌ని అన్నారు. అయితే విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో నేర్చుకున్నార‌ని సంతోషం వ్య‌క్తం చేశారు. వ‌ర్క్ ఫ్రం హోం పెర‌గ‌డం, ‌అవ‌కాశాలు విస్తృతం అవుతున్న త‌రుణంలో క్షేత్ర‌స్థాయి నుంచి విద్యార్థులు కోడ‌ర్లుగా ఎదిగేలా ఈ శిక్ష‌ణ ఉప‌క‌రిస్తుందన్నారు. తాము విద్యార్థుల‌కు అందించిన శిక్ష‌ణ‌ను స్కోచ్ సంస్థ గుర్తించ‌డం సంతోష‌క‌ర‌మ‌ని సందీప్ మ‌క్తాల పేర్కొన్నారు. స‌హ‌క‌రించిన జిల్లా అధికారుల‌కు, వాలంటీర్ల‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. రాబోయే కాలంలో రాష్ట్రవ్యాప్తంగా మ‌రిన్ని కార్య‌క్రాలు చేప‌ట్ట‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.