బుధవారం 20 జనవరి 2021
Telangana - Jan 09, 2021 , 01:00:19

ఆవిష్కరణలు ప్రజలకు చేరాలి

ఆవిష్కరణలు ప్రజలకు చేరాలి

  • లైఫ్‌సైన్స్‌లో రాష్ట్రాన్ని నంబర్‌వన్‌గా నిలపడమే లక్ష్యం: మంత్రి కేటీఆర్‌
  • రీచ్‌ ఆధ్వర్యంలో నడిచే సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మెగాక్లస్టర్‌ ప్రారంభం 

హైదరాబాద్‌, జనవరి 8 (నమస్తే తెలంగాణ): ఆవిష్కరణలు ఏవైనా ప్రయోగశాల నుంచి ప్రజలకు చేరువైనప్పుడే పూర్తి లక్ష్యం నెరవేరుతుందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. రాష్ర్టాభివృద్ధిలో శాస్త్రీయ పురోగతి ఎంతో ముఖ్యమైందని చెప్పారు. లైఫ్‌సైన్స్‌, వ్యవసాయం, డిజిటల్‌ టెక్నాలజీలో రాష్ట్రాన్ని అత్యుత్తమ కేంద్రంగా నిలపడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రధానమంత్రి సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌ అడ్వయిజర్‌ కౌన్సిల్‌ (పీఎం-ఎస్‌టీఐఏసీ) ద్వారా ఎంపికై.. రీచ్‌ (రిసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సర్కిల్‌ ఆఫ్‌ హైదరాబాద్‌) ఆధ్వర్యంలో నడిచే సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మెగాక్లస్టర్‌ను కేంద్రప్రభుత్వ ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌ అడ్వయిజర్‌ కే విజయ్‌రాఘవన్‌తో కలసి కేటీఆర్‌ శుక్రవారం వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ క్లస్టర్‌ ద్వారా వచ్చే ఆవిష్కరణలు ప్రజల జీవితాలను మార్చడంలో తోడ్పడుతాయని ఆశిస్తున్నామని చెప్పారు. వచ్చే 5 నుంచి7 ఏండ్లలో కనీసం 5 అతిపెద్ద ప్రభావవంతమైన కంపెనీలను ప్రారంభించడంలో సహాయపడాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఇది లక్షలమందికి ప్రయోజనం చేకూరుస్తుందని, దేశవ్యాప్తంగా లక్షకుపైగా ఉద్యోగాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు. విజయ్‌రాఘవన్‌ స్థానిక శాస్త్రీయ, విజ్ఞానాలను మెగా క్లస్టర్లు ప్రభావితం చేసి వేగవంతమైన ఫలితాలను రాబడుతాయని, పేటెంట్ల సమస్యకు పరిష్కారం చూపుతుందని తెలిపారు. రీచ్‌ డైరెక్టర్‌ జనరల్‌ అజిత్‌ రంగ్నేకర్‌ మాట్లాడుతూ.. పరిశోధనలను వేగవంతం చేయడంలో, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంలో హైదరాబాద్‌ క్లస్టర్‌ తోడ్పడుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌ అడ్వయిజర్‌ సాంకేతిక కార్యదర్శి డాక్టర్‌ అరవింద మిత్ర పాల్గొన్నారు. 

హైదరాబాద్‌ ఎందుకు ఎంపికైందంటే.. 

సైన్స్‌, రిసెర్చ్‌, ఇన్నోవేషన్‌ అంశాలపై దృష్టి సారించిన కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్లస్టర్లు ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. స్థానిక శాస్త్రీయవిజ్ఞానాన్ని ప్రోత్సహించేలా, శాస్త్రీయ సంస్థలతో అనుసంధానం చేసేలా ఇవి కృషి చేయనున్నాయి. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి సంబంధించిన ప్రముఖ సంస్థలు, కంపెనీలు, పరిశ్రమలకు నిలయమైన హైదరాబాద్‌, బెంగళూరు, ఢిల్లీ, పుణే నగరాలను  పీఎం-ఎస్‌టీఐఏసీ కోసం ఎంపిక చేసింది. వివిధరంగాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ దేశంలోనే అత్యధిక వృద్ధి రేటు కలిగిన రాష్ట్ల్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో క్లస్టర్‌ ఏర్పాటు చేసేందుకు ఎంపికైంది. ఫార్మా క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా పేరుగాంచిన హైదరాబాద్‌ 35 శాతం ఫార్మా ఉత్పత్తుల్లో భాగస్వామ్యం కలిగిఉన్నది. సీడ్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియా పేరుతోపాటు, టెక్నాలజీలో సత్తా చాటుతున్న తెలంగాణలో 60కి పైగా ప్రభుత్వ, ప్రపంచస్థాయి ప్రైవేటు పరిశోధన కేంద్రాలు కొలువుదీరాయి. ఇక ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రీచ్‌.. ఎయిరోస్పేస్‌, డిఫెన్స్‌, ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌, లైఫ్‌సైన్స్‌ రంగాల్లో ఎఫెక్టివ్‌ ఇన్నోవేషన్‌ ఎకో సిస్టమ్‌ పెంపొందించేందుకు కలిసి పనిచేస్తున్నది. దీంతోపాటు అనుబంధ రంగాలైన పునరుత్పాదక ఇంధనం, వ్యర్థాల నిర్వహణ, ఎమర్జింగ్‌ టెక్నాలజీల తదితర రంగాలపై దృష్టి సారిస్తున్నది.


logo