శనివారం 04 జూలై 2020
Telangana - Jun 17, 2020 , 01:38:44

సెప్టెంబర్‌లో తరగతులు!

సెప్టెంబర్‌లో తరగతులు!

  • దశలవారీగా ప్రారంభానికి మొగ్గు
  • 220 రోజులపాటు విద్యాబోధన
  • విద్యాశాఖ అధికారుల ఆలోచనలు
  • విద్యార్థులు నష్టపోకుండా చర్యలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో నూతన విద్యాసంవత్సరం మూడు నెలలు ఆలస్యంగా మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్‌ రెండోవారంలో రెగ్యులర్‌ తరగతులు ప్రారంభించే అవకాశాలున్నాయి. తరగతులను దశలవారీగా ప్రారంభించాలా? వద్దా అనే అంశంపై ప్రభుత్వం యంత్రాంగం సమాచనలు చేస్తున్నది. ఓ వైపు హైదరాబాద్‌ చుట్టుపక్కల జిల్లాల్లో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు ఇంకా నూతన (2020-21) విద్యాసంవత్సరం ప్రారంభం కాలేదు. సాధారణ పరిస్థితులు ఎప్పుడు వస్తాయనే అంశంపై ఎవరికీ స్పష్టత లేదు. 

ఈ క్రమంలో విద్యార్థులకు నష్టం వాటిల్లకుండా జాతీయ విద్యాసంస్థలను దృష్టిలో పెట్టుకుని విద్యాసంవత్సరాన్ని ప్రారంభించడంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఒకవేళ స్కూళ్లు ప్రారంభిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 1-10 వరకు స్కూళ్లు ప్రారంభించాలా? లేదా 8 నుంచి 12 వరకు ఒకసారి, 5-7 వరకు రెండోసారి, 1 నుంచి 5తో పాటు ప్రీ ప్రైమరీ స్కూళ్లను దశలవారీగా ప్రారంభించాలా? వద్దా అనే అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. దీనివల్ల కలిగే మంచిచెడులపైనా ప్రభుత్వంలో సమాలోచనలు జరుగుతున్నాయి. సెప్టెంబర్‌ రెండోవారంలో స్కూళ్లను ప్రారంభిస్తే.. ఎస్సీఈఆర్టీ నిర్దేశించిన సిలబస్‌ పూర్తికి 220 రోజులు విద్యాబోధన తప్పనిసరిగా జరుగాల్సి ఉంటుంది. 

అంటే తరగతులు, పరీక్షలను వచ్చే ఏడాది (2020-21 విద్యాసంవత్సరం) జూలై/ఆగస్టులోగా పూర్తిచేయాలనే ఆలోచనలో విద్యాశాఖ అధికారులు ఉన్నట్టు తెలుస్తున్నది. కొవిడ్‌-19 నేపథ్యంలో విద్యార్థులు భౌతికదూరం పాటి స్తూ.. శానిటైజర్‌, మాస్కులు తప్పనిసరిగా ధరించేలా నూతన విద్యాసంవత్సరం ప్రా రంభంలో మార్గదర్శకాలను విడుదలచేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. కాగా, మూడునెలలు ఆలస్యంగా విద్యాసంవత్స రం ప్రారంభమైతే.. కేంద్రం 2021లో జరిపే ఐఐటీ-జేఈఈ, నీట్‌, రాష్ట్రంలో నిర్వహించే ఎంసెట్‌ వంటి ప్రవేశపరీక్షలు కూడా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. 

బడులు ప్రారంభించండి విధులకు సిద్ధం: పీఆర్టీయూ టీఎస్‌

రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభించాలని, తామంతా విధుల్లో చేరడానికి సిద్ధం గా ఉన్నామని పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర నాయకులు మారెడ్డి అంజిరెడ్డి, ఎం చెన్నయ్య మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటి స్తూ కనీసం తొమ్మిది, పది తరగతులకు పాఠాలు బోధించేవిధంగా నిర్ణయం తీసుకోవాలని విద్యాశాఖ మంత్రిని కోరారు.

పల్లెల్లోనూ ఆన్‌లైన్‌ పాఠాలు!

కరోనా కల్లోలంతో ఇప్పట్లో విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. దీంతో ప్రైవేటు, కార్పొరేటు విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ వైపు అడుగులు వేస్తున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌, వరంగల్‌కు పరిమితమైన ఆన్‌లైన్‌ తరగతులు జిల్లాలకూ విస్తరిస్తున్నాయి. తాజా గా కరీంనగర్‌, ఖమ్మం తదితర జిల్లాల్లో  ఈ విధానంవైపు అడగులు వేస్తున్నాయి. పలు విద్యాసంస్థలు ఆరోతరగతి నుంచి ఐఐటీ, నీట్‌ వంటి ఫౌండేషన్‌ కోర్సులనూ ఆన్‌లైన్‌ పరిధిలోకి తీసుకొస్తున్నాయి. ఈ మేరకు ఆన్‌లైన్‌ బోధన, వీడి యో లెక్చర్లు/పాఠాలు అందించేందుకు మార్కెట్‌లో ఆనేక సాఫ్ట్‌వేర్‌ సంస్థలు, సర్వీసు ప్రొవైడర్‌ సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. ఆయా సంస్థలు జిల్లాల్లో సేవలందించేందుకు ముందుకు వస్తున్నట్టు పలు ప్రైవేటు విద్యాసంస్థల యజమానులు తెలిపారు. ఈ విద్యాసంవత్సరం ఇప్పట్లో ప్రారంభం కాదని, పైతరగతులపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఆయా సంస్థలు అడుగులు వేస్తున్నాయి.  

బడ్జెట్‌ స్కూళ్లదీ అదేబాట

రాష్ట్రంలోని అన్ని బడ్జెట్‌ స్కూళ్లు కూడా ఆన్‌లైన్‌ బోధన వైపు ఆసక్తి చూపుతున్నాయి. అన్ని ప్రైవేటు స్కూళ్లు, జూనియర్‌ కాలేజీల్లో ఇప్పుడు ఆన్‌లైన్‌ పాఠాల ట్రెండ్‌ మొదలైంది. మారిన పరిస్థితుల్లో ఆన్‌లైన్‌ వైపు మొగ్గు చూపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ట్రస్మా(తెలంగాణ గు ర్తింపు పొందిన పాఠశాల యజమాన్యాల సంఘం) గౌరవాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఇప్పట్లో ఇంతకన్నా ప్రత్యామ్నాయం లేదని అభిప్రాయపడ్డారు. 

గ్రామీణ విద్యార్థులకు పాట్లు

గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సౌక ర్యం సక్రమంగా ఉండక విద్యార్థులకు పా ట్లు తప్పడం లేదు. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు అందుబాటులో లేకపోవడం మరో సమస్యగా మారుతున్నది. ఆన్‌లైన్‌ తరగతులకు సపోర్టు చేసే స్థాయిలో ఇంటర్నెట్‌ స్పీడ్‌ ఉండకపోవడంతో తరచూ అంతరా యం ఏర్పడుతున్నది. ఈ సమస్యలు అధిగమిస్తే ఆన్‌లైన్‌ పాఠాలతో సత్ఫలితాలు సాధించవచ్చని  తెలంగాణ ప్రైవేటు జూనియర్‌ కాలేజీ యాజమాన్యల సంఘం అధ్యక్షుడు గౌరి సతీశ్‌ తెలిపారు.


logo