ఆదివారం 12 జూలై 2020
Telangana - May 30, 2020 , 02:09:23

జూలై రెండోవారంలో బడులు?

జూలై రెండోవారంలో బడులు?

  • ఆగస్టునుంచి ఇంటర్‌ క్లాస్‌లు 
  • ఎమ్మెల్సీలతో మంత్రి సబిత

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో పాఠశాలలు జూలై రెండోవారంలో ప్రారంభించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. పదోతరగతి పరీక్షలు జూలై 5 వరకు ఉన్నందున, ఆ తర్వాత పాఠశాలలు ప్రారంభిస్తామన్నారు. ఈ అంశంపై త్వరలో క్యాబినెట్‌ సబ్‌కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్టు శుక్రవారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, విద్యాశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో తెలిపారు. ఆగస్టు నెల ప్రారంభం నుంచి ఇంటర్మీడియట్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌ తరగతులు ప్రారంభించే ప్రతిపాదనలు క్యాబినెట్‌ సబ్‌కమిటీ ముందు ఉంచనున్నారు. వేసవి సెలవులు ముగిసిన వెంటనే జూన్‌ 12 నుంచి ఉపాధ్యాయులంతా విధుల్లో చేరాల్సి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. సమావేశంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, రఘోత్తంరెడ్డి, ఏ నర్సిరెడ్డి, పాఠశాల విద్యాశాఖ, ఇంటర్మీడియట్‌, ఉన్నత విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

పదో తరగతి పరీక్షలను రద్దుచేయండి: పీఆర్టీయూటీఎస్‌

వచ్చే నెల 8వ తేదీ నుంచి నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలను రద్దుచేయాలని పీఆర్టీయూ టీఎస్‌ నాయకులు శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డిని కోరారు. ఈ మేరకు వారు మంత్రికి వినతిపత్రం అందచేశారు. 


logo