శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 16, 2020 , 01:23:09

సింగరేణికి కేంద్రం ప్రశంసలు

సింగరేణికి కేంద్రం ప్రశంసలు

  • ఈ నెల 23న బొగ్గు కంపెనీల్లో వన మహోత్సవ్‌
  • మొత్తం 40 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం
  • సింగరేణిలోనే 35 లక్షలు నాటుతామన్న సీఎండీ
  • అభినందించిన కేంద్ర బొగ్గుశాఖ ప్రత్యేక కార్యదర్శి
  • నాలుగేండ్లలో 4 కోట్ల మొక్కలు నాటిన సంస్థ
  • ఈ ఏడాది మరో 35.47 లక్షల మొక్కలు లక్ష్యం

దేశంలోని బొగ్గు కంపెనీలలో ఈ నెల 23వ తేదీ నుంచి నిర్వహించే వన మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర బొగ్గుశాఖ మొత్తం 40 లక్షల మొక్కలునాటాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ మేరకు బొగ్గుశాఖ ప్రత్యేక కార్యదర్శి దేశంలోని కంపెనీలతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి వివరించారు. సింగరేణి తరఫున 35 లక్షల మొక్కలు నాటుతామని సంస్థ సీఎండీ చెప్పారు. దీంతో కేంద్ర అధికారి ఆశ్చర్యపోయారు. సంస్థ పనితీరును ప్రశంసించారు. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మొక్కలు నాటే కార్యక్రమంలో సింగరేణి సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు సంస్థలకే స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఈ విషయంలో ఏకంగా కేంద్ర బొగ్గుశాఖ ప్రశంసలు సైతం అందుకున్నది. దేశవ్యాప్తంగా బొగ్గు కంపెనీల్లో ఈ నెల 23న వన మహోత్సవ్‌ కార్యక్రమానికి బొగ్గుశాఖ సన్నద్ధమైంది. ఇందులో 40 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంటే.. సింగరేణి తరఫునే 35 లక్షల మొక్కలు నాటుతామని సంస్థ సీఎండీ ఎన్‌ శ్రీధర్‌ ముందుకొచ్చారు. దీంతో కేంద్ర బొగ్గుశాఖ కార్యదర్శి ఆశ్చర్యపోవడంతోపాటు సంస్థ పనితీరును అభినందించారు. బుధవారం న్యూఢిల్లీ నుంచి కేంద్ర బొగ్గుశాఖ ప్రత్యేక కార్యదర్శి అనిల్‌కుమార్‌ జైన్‌ దేశవ్యాప్తంగా 8 బొగ్గు ఉత్పత్తి కంపెనీలతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ శ్రీధర్‌ మాట్లాడుతూ.. గత ఐదేండ్లలో తెలంగాణకు హరితహారం కింద ఏడాదికి 65 లక్షల నుంచి 70 లక్షల మొక్కలు నాటుతున్నామని, ఏటా 30 లక్షల మొక్కలను సమీప గ్రామాలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఇప్పటివరకు సింగరేణి పరిధిలో 1,2172 హెక్టార్లలో 5 కోట్ల 25 లక్షల మొక్కలను నాటామని, ఇందులో 75 శాతం మొక్కలు వృక్షాలుగా ఎదుగుతున్నాయని తెలిపారు. దీనిపై స్పందించిన కేంద్ర బొగ్గుశాఖ ప్రత్యేక కార్యదర్శి సంస్థ పనితీరును ప్రశంసించారు. 

ఈ ఏడాది 804 హెక్టార్లలో..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని సింగరేణి విజయవంతంగా కొనసాగిస్తున్నది. 2015లో సీఎం కేసీఆర్‌ ఈ కార్యక్రమాన్ని ప్రకటించగానే సింగరేణి నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు రంగంలోకి దిగింది. గత నాలుగేండ్లలో 3,718.5 హెక్టార్లలో మొత్తం 3 కోట్ల 97 లక్షల 75 వేల 148 మొక్కలను నాటింది. ఈ ఏడాది 804 హెక్టార్లలో 35.47 లక్షల మొక్కలను నాటాలని నిర్ణయించింది. సింగరేణి 1984 నుంచి నిబంధనల ప్రకారం పర్యావరణ చర్యల్లో భాగంగా మొక్కలు నాటుతున్నది. ఇందుకు సంస్థ విస్తరించిన 6 జిల్లాల్లో 12 చోట్ల సొంతంగా నర్సరీలను ఏర్పాటుచేసింది. 1984 నుంచి 2008 వరకు సంస్థ పరిధిలో 58.78 లక్షల మొక్కలను నాటింది. అంటే సగటున ఏడాదికి 2.44 లక్షల మొక్కలు నాటారన్నమాట. 2009 నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని మరింత పెంచారు. దీంతో ఏడాదికి సగటున 14.48 లక్షల మొక్కలు నాటుతూ.. 2014 వరకు ఐదేండ్లకాలంలో మొత్తం 72.43 లక్షల మొక్కలను నాటారు. ఈ లెక్కన 1984 నుంచి 2014 వరకు మొత్తం 1.31 కోట్ల మొక్కలను నాటారు. కానీ సీఎం కేసీఆర్‌ ఇచ్చిన స్ఫూర్తి.. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించిన సింగరేణి సీఎండీ ఎన్‌ శ్రీధర్‌ ఆధ్వర్యంలో విస్తృతంగా మొక్కలు నాటి, సంరక్షించే కార్యక్రమాన్ని చేపట్టింది.logo