సోమవారం 18 జనవరి 2021
Telangana - Jan 06, 2021 , 01:58:13

సౌరవిద్యుత్‌ హబ్‌గా ఇల్లెందు!

సౌరవిద్యుత్‌ హబ్‌గా ఇల్లెందు!

  • కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి ప్రశంస

హైదరాబాద్‌, జనవరి 5 (నమస్తే తెలంగాణ): మారుమూల కోల్‌టౌన్‌ ఇల్లెందు త్వరలోనే సౌరవిద్యుత్‌ ఉత్పత్తి హబ్‌గా మారనున్నదని కేంద్ర గనులు, బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషి పేర్కొన్నారు. మారుమూల గిరిజన పట్టణమైన ఇల్లెందును సోలార్‌హబ్‌గా తీర్చిదిద్దేందుకు సింగరేణి సంస్థ చేపట్టిన చర్యలపై వీడియోను ట్విట్టర్‌ వేదికగా పంచుకొని సంతోషం వ్యక్తం చేశారు. వినూత్న ఆలోచనలతో వ్యాపారాన్ని పెంచుకుంటున్న సింగరేణి పునరుత్పాదక ఇంధన వనరుల విభాగంలోనూ దూసుకెళ్తున్నది. 

ఇల్లెందులో 39మెగావాట్ల కేంద్రం

సింగరేణి విస్తృతంగా సౌరవిద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటుచేస్తున్నది. సింగరేణివ్యాప్తంగా రూ.1,361 కోట్లతో 300 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్లను నెలకొల్పనున్నది. ఇందులోభాగంగానే ఇల్లెందులో 39 మెగావాట్ల సౌర విద్యుత్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. సౌర విద్యుత్‌తో ఇల్లెందు పట్టణ వెలుగులు దేశ రెన్యూవబుల్‌ ఎనర్జీ పటంలోనూ చోటు దక్కించుకోనున్నాయి. ఇదే విషయాన్ని పేర్కొంటూ త్వరలోనే ఇల్లెందు సౌర విద్యుత్‌ ఉత్పత్తి హబ్‌గా మారనుందని కేంద్ర మంత్రి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.