హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం మంగళవారం తెలంగాణ నుంచి దూరంగా వెళ్లిపోయింది. దీంతో అతి భారీ వర్షాల ముప్పు తప్పింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్నాయి. తెలంగాణలో కిందిస్థాయి పశ్చిమగాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లో 12.83 సెంటీమీటర్లు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బనలో 11.40 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు పలు జిల్లాలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.