శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Oct 02, 2020 , 02:02:07

పోలీసుల ఫేక్‌బుక్‌తో మోసాలు

పోలీసుల ఫేక్‌బుక్‌తో  మోసాలు

  • డబ్బు పంపాలంటూ రిక్వెస్ట్‌లు
  • సైబర్‌ నేరగాళ్ల కొత్త పంథా
  • నల్లగొండ పోలీసులకు చిక్కిన ముఠా!

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సైబర్‌ నేరగాళ్లు పోలీసుల ముసుగులో మో సాలు చేస్తున్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది వ్యక్తిగత ఫేస్‌బుక్‌ ఖాతాలు, పోలీస్‌ స్టేషన్ల అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతాల నుంచి సేకరించిన సమాచారంతో నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్లు సృష్టిస్తున్నారు. వాటినుంచి ‘అత్యవసరంగా కొంత డబ్బు అవసరం ఉన్న ది. వెంటనే పంపండి’ అని ఫేస్‌బుక్‌లో పరిచయస్థులకు మెసేజ్‌లు పెడుతున్నారు. ఇటీవల నల్లగొండ ఎస్పీ రంగనాథ్‌ ఫేస్‌బుక్‌ ఖాతా ను ఇదే తరహాలో సైబ ర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేశా రు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న నల్లగొండ పోలీసులు..ఈ నేరాలకు పాల్పడుతున్న ముఠా కీలక విషయాలు సేకరించినట్టు తెలుస్తున్నది. తెలంగాణతోపాటు ఏపీ, హిమాచల్‌ప్రదేశ్‌, హర్యానా, గుజరాత్‌, ఒడిశా, మహారాష్ట్ర తదితర రాష్ర్టాల పోలీసుల పేరిట కూడా ఈ సైబర్‌ ముఠాలు నకిలీ ఫేస్‌బుక్‌లు క్రియేట్‌ చేసినట్టు తెలిసింది. అప్రమత్తమైన పోలీసులు తెలిసిన వారికి వ్యక్తిగతంగా ఎస్‌ఎంఎస్‌లు పెట్టుకుని మరీ.. నకిలీ ఖాతాలతో మోసగించే సైబర్‌నేరగాళ్ల గురించి చెప్తున్నారు.

చదువు పదిలోపు.. నేరాలకు లేదు అదుపు

నల్లగొండ పోలీసులు.. మోసగాళ్ల రూట్‌లోనే వెళ్లి సైబర్‌ నేరగాళ్ల జాడ కనిపెట్టినట్టు తెలిసింది. పదిరోజులుగా రాజస్థాన్‌ జిల్లా భరత్‌పుర్‌ జిల్లాలో చేసిన ఆపరేషన్‌లో పురోగతి సాధించినట్టు సమాచారం. చిన్న కుగ్రామంలో పదో తరగతి కూడా పూర్తిచేయని యువకులను స్థానిక నాయకులు ముఠాలుగా ఏర్పాటుచేసి, వారిద్వారా ఈ వ్యవహారం నడుపుతున్నట్టు తెలిసింది. దర్యాప్తునకు పోలీస్‌ బృందాలు వస్తే సెల్‌ఫోన్‌ నెట్‌వర్క్‌ ఆధారంగా ముందుగానే పసిగట్టి 50 కిలోమీటర్ల పరిధిలోపే ఉండే ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ రాష్ర్టాలకు పారిపోతున్నారు. భౌతిక దాడులకు పాల్పడే ఇలాంటి గ్యాంగ్‌ను సైతం.. తెలంగాణ నుంచి వెళ్లిన నల్లగొండ పోలీస్‌ బృందాలు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ‘చిన్న చిన్న గ్రామాల్లో యువకులంతా ఇలా ముఠాలుగా ఏర్పడి సైబర్‌నేరాలు చేస్తున్నారు. వాళ్లకు ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేదు. నకిలీ ధ్రువపత్రాలతో వందల సిమ్‌ కార్డులు తీసుకుని వాటిద్వారా సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నట్టు గుర్తించాం. పూర్తి వివరాలు సేకరిస్తున్నాం’ అని జిల్లాకు చెందిన పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.