గురువారం 02 జూలై 2020
Telangana - Jun 18, 2020 , 01:35:22

మృతదేహాలకు కరోనా పరీక్షలపై స్టే

మృతదేహాలకు కరోనా పరీక్షలపై స్టే

  • హైకోర్టు ఉత్తర్వులను నిలిపేసిన సుప్రీంకోర్టు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:  ప్రభుత్వ దవాఖానల్లో చనిపోయినవారందరి మృతదేహాలకు కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయాలంటూ హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. హైకోర్టు ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలుచేసిన అప్పీల్‌పై న్యాయమూర్తులు అశోక్‌భూషణ్‌, ఎస్కే కౌల్‌, ఎంఆర్‌ షాతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. హైకోర్టు ఆదేశాలను ‘ప్రీమెచ్యూర్‌ ఆర్డర్‌' అని వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది శ్యాం దివాన్‌ వాదనలు వినిపించారు. కరోనా సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని ఐసీఎమ్మార్‌ ఎప్పటికప్పుడు కొత్త మార్గదర్శకాలను జారీచేస్తున్నదని తెలిపారు. ఆ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోకుండా హైకోర్టు ఆదేశాలు జారీచేసిందని పేర్కొన్నారు. హైకోర్టు ఎక్కువగా పత్రికల్లో వచ్చిన కథనాలపై ఆధారపడి ఆదేశాలిచ్చిందని తెలిపారు. కరోనా పరీక్షలపై ఐసీఎమ్మార్‌ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు కచ్చితంగా పాటిస్తున్నాయని పేర్కొన్నారు. కొవిడ్‌-19 టెస్టింగ్‌ కిట్ల విషయంలో ప్రపంచం మొత్తం ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని, వాటిని చాలా జాగ్రత్తగా, పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉన్నదని సుప్రీంకోర్టుకు తెలిపింది. తెలంగాణ ప్రభుత్వ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. ఈ మేరకు ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. విచారణను రెండువారాలపాటు వాయిదా వేసింది.


logo