శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Telangana - Jan 27, 2021 , 02:31:55

అడవి పందులను వధించవచ్చు

అడవి పందులను వధించవచ్చు

 • సర్పంచ్‌లకు నిర్ణయాధికారాలు
 • పంటలు, ఆస్తులకు నష్టం కలిగిస్తేనే చంపాలి
 • మాంసం వినియోగించరాదు.. కళేబరాలను పాతిపెట్టాలి
 • రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

ప్రత్యేక ప్రతినిధి, జనవరి25 ( నమస్తే తెలంగాణ): పంటలను నాశనం చేస్తూ రైతులకు సమస్యగా మారిన అడవిపందులను వధించడానికి గ్రామ సర్పంచులకు విచక్షణాధికారాన్ని కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులను జారీచేసింది. ఈ మేరకు సర్పంచులను గౌరవ వైల్డ్‌లైఫ్‌ (వన్యప్రాణుల) వార్డెన్లుగా నియమించింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నది. పంటలను నాశనం చేస్తున్న సమయంలో మాత్రమే అడవిపందులను వధించడానికి సర్కార్‌ అనుమతినిచ్చింది. అడవిపందుల వల్ల పంటలకు, ఇతర ఆస్తులకు తీరని నష్టం వాటిల్లుతున్నదని నిర్ధారణ జరిగినప్పుడు మాత్రమే వాటిని కాల్చిచంపడానికి షూటర్‌లను అనుమతించాలి తప్ప సాధారణ పరిస్థితులలో కాదని ఉత్తర్వులలో స్పష్టం చేసింది.

వ్యవసాయ పంటలు, ఉద్యానవనాల పరిధిలోనే కల్లింగ్‌ ఉండాలి, కానీ ఏ ఇతర ప్రాంతంలోనూ అడవి పందులకు హాని తలపెట్టరాదని ప్రభుత్వం పేర్కొన్నది. వాస్తవానికి తమ ప్రాంతాలలో విపరీతంగా పెరిగిపోతున్న కొన్ని జాతుల జంతువులు ఆస్తులకు, పంటలకు నష్టం కలిగిస్తున్నాయని వాటిని వర్మిన్‌ (క్రిమికీటకాలు, ఎలుకలు) ప్రకటించాలని చాలా రాష్ర్టాలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఇందులో భాగంగా గుజరాత్‌లో నీల్గాయి, హిమాచల్‌ప్రదేశ్‌లో కోతులను వర్మిన్‌గా ప్రకటించారు. అయితే దీనివల్ల కొందరు జంతువులను విచక్షణారహితంగా వధిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్ర ప్రభుత్వం వర్మిన్‌ ప్రతిపాదనల జోలికి వెళ్లడం లేదు. జంతువులతో తీవ్ర సమస్య ఉంటే చీఫ్‌ వైల్డ్‌లైఫ్‌ వార్డెన్‌ అనుమతితో ఆయా గ్రామపంచాయతీలకు అధికారమివ్వవచ్చని నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ వైల్డ్‌లైఫ్‌ స్పష్టం చేస్తున్నది.

దీని ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పంటలకు, ఆస్తులకు నష్టం కలిగిస్తున్న జంతువులను వధించడానికి 2010లో ఉమ్మడి రాష్ట్రంలో డీఎఫ్‌వోలకు అధికారాలనిచ్చారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2015-16లో డీఎఫ్‌వోల అధికారాలను పునరుద్ధరించారు. కానీ డీఎఫ్‌వోలు నిర్ణయం తీసుకోవడంలో చాలా జాప్యం జరుగుతున్నందున గ్రామ పంచాయతీలకు అధికారాన్ని కట్టబెడుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రంలోని చాలా జిల్లాలలో అడవిపందుల వల్ల తీవ్ర పంట నష్టం జరుగుతున్న తరుణంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఇందుకు కొన్ని షరతులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ డాక్టర్‌ రజత్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. 

ఉత్తర్వుల్లోని అంశాలు

 • రైతుల నుంచి రాతపూర్వకంగా ఫిర్యాదు అందితేనే సర్పంచులు అడవిపందులపై చర్యకు ఉపక్రమించాలి.
 • గ్రామ పెద్దలతో కలిసి అడవి పందులు సమస్యలు సృష్టిస్తున్న ప్రాంతాలకు వెళ్లి అక్కడి పరిస్థితిని లోతుగా అధ్యయనం చేయాలి. అడవి పందులను చంపక తప్పని పరిస్థితి ఉంటే.. పంచనామా నిర్వహించి అందరి సంతకాలు సేకరించాలి. 
 • చీఫ్‌ వైల్డ్‌లైఫ్‌ వార్డెన్‌ ఉత్తర్వుల ప్రకారం కాల్చివేతకు సర్పంచులు ఆదేశాలు జారీ చేయవచ్చు. అడవి పందులను కాల్చే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. 
 • కేవలం పంట పొలాలలోనే అడవి పందులను కాల్చడానికి షూటర్‌లకు అనుమతినివ్వాలి. రక్షిత ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు , ప్రభుత్వ, ప్రైవేట్‌ స్థలాలలో సంచరించే పందులను కాల్చి చంపడానికి వీలులేదు. ఈ సందర్భంగా మనుషులకు గానీ ఇతర జంతువులకు గానీ ఎలాంటి అపాయం జరుగకుండా చూడాలి. 
 • అడవి పందులను కాల్చే సమయంలో ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం జరిగినా.. ఏవైనా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నా.. దానికి పూర్తి బాధ్యత షూటర్‌లపైనే ఉంటుంది. దీనికి అటవీశాఖ ఎలాంటి బాధ్యత వహించదు.
 • అడవి పందులను కాల్చడానికి అనుమతినిస్తూ గ్రామపంచాయతీ చేసిన తీర్మానం ప్రతిని స్థానిక అటవీ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ లేదా బీట్‌ ఆఫీసర్‌, సెక్షన్‌ ఆఫీసర్‌లకు సమర్పించాలి. 
 • చంపిన అడవి పందుల కళేబరాలను పూడ్చే సమయంలో గ్రామపంచాయతీ పంచనామా చేయాలి, స్థానిక అటవీ అధికారుల సమక్షంలో భూమి లోపల పాతిపెట్టాలి. మృత కళేబరాలను ఎక్కడా వాడటానికి వీలు లేదు. మాంసం, లేదా ఇతర శరీర భాగాలను వాడితే చట్టపరంగా కేసు నమోదు చేస్తారు. ఎటువంటి పరిస్థితుల్లో ఎన్ని పందులను చంపాల్సి వచ్చింది అనే నివేదికను స్థానిక ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ సంబంధిత అటవీ డీఎఫ్‌వో, లేదా ఎఫ్‌డీవోకు సమర్పించాలి. అక్కడి నుంచి ఆ నివేదిక చీఫ్‌ వైల్డ్‌లైఫ్‌ వార్డెన్‌కు చేరుతుంది. గ్రామ సర్పంచులకు ఇచ్చిన విచక్షణాధికారం కేవలం ఒక ఏడాది వరకు ఉంటుంది.ఆ తర్వాత తిరిగి రెన్యువల్‌ చేసుకోవాలి.

VIDEOS

logo