శనివారం 28 మార్చి 2020
Telangana - Mar 16, 2020 , 20:48:10

సర్పంచ్‌ను సస్పెండ్‌ చేసిన కలెక్టర్‌

సర్పంచ్‌ను సస్పెండ్‌ చేసిన కలెక్టర్‌

మహబూబ్ నగర్: జిల్లాలోని హన్వాడ మండలం టంకర గ్రామ పంచాయతీ సర్పంచ్‌ మొండే అచ్చన్నను సస్పెండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు ఉత్తర్వులు జారీ చేశారు.  మెండే అచ్చన్న అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు, తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు సర్పంచ్ బాధ్యతలనుండి సస్పెండ్ చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. అచ్చన్న తన సొంత పొలంలో నాలా అనుమతి లేకుండా,  గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా అక్రమలే  అవుట్ చేశాడు. నిబంధనలకు విరుద్ధంగా అమ్ముకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

నాలా అనుమతి లేకుండా చేసిన వెంచర్ యజమానికి వ్యక్తిగతంగా సహకరించి గ్రామపంచాయతీకి రావాల్సిన టాక్స్ రాకుండా చేశాడు.  గ్రామ పంచాయతీకి సంబంధించిన  కుమ్మరి గెరి బోరు నీటిని తన సొంత వ్యవసాయ భూమికి వాడుకున్నాడు.  ప్రభుత్వానికి సంబంధించిన ఎకరం ఒక గుంట భూమిని కబ్జా చేశాడు. ప్రభుత్వ ట్రాక్టర్, ట్యాంకర్లను తన సొంత అవసరాలకు వాడుకోవడం,   హరితహారం కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయటం, ప్రైవేటు వ్యక్తులకు కిరాయికి ఇవ్వటం వంటి పనులు చేశాడు.

 గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న పెద్ద చెరువు  మట్టిని ట్రిప్పు లెక్కన డబ్బులకు అమ్ముకున్నాడు.  గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా గ్రామంలో కొత్త ఇళ్ల నిర్మాణాలకు లోపాయికారి ఒప్పందంతో సహకరించి గ్రామ పంచాయతీకి రావలసిన ట్యాక్స్ ను దారి మళ్ళించాడు.  ఉపాధి హామీ పథకంలో మంజూరైన స్మశానవాటికలో నిబంధనలకు విరుద్ధంగా కూలీలకు పని కల్పించకుండా మిషన్లతో పని చేయించి కూలీలకు పని లేకుండా చేశాడు. పై అన్ని అభియోగాలను ప్రాథమిక ఆధారాలను దృష్టిలో ఉంచుకొని వీటన్నింటిపై దర్యాప్తులో ఉంచి తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 సెక్షన్ 37( 5 )ప్రకారం తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు సర్పంచ్ బాధ్యతలనుంచి మెండే అచ్చన్నను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.


logo