శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 08, 2020 , 01:58:34

రేపటి నుంచే అర్హులకు ఇంటింటికీ చీరెలు పంపిణీ

రేపటి నుంచే అర్హులకు ఇంటింటికీ చీరెలు పంపిణీ

  • అక్క చెల్లెళ్లకు అన్న కట్నం
  • పేదింటి ఆడబిడ్డలకు కేసీఆర్‌ ప్రభుత్వం
  • 287 రకాల డిజైన్లలో తయారైన చీరెలు

అందించే చిరు కానుక.. బతుకమ్మ చీరె. చిరుకానుకే అయినా గొప్పగా ఉండాలని 287 డిజైన్లలో, ధగధగమెరిసే బంగారు, వెండి జరీతో చీరెలను తయారు చేయించారు. విభిన్నమైన రంగుల్లో, అత్యంత ఆకర్షణీయంగా నేయించిన చీరెల పంపిణీకి రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా 18 ఏండ్లు నిండిన తెలంగాణ ఆడపడుచులు రేపటి నుంచే చీరెలను అందుకోనున్నారు.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: బతుకమ్మ చీరెల పంపిణీకి రంగం సిద్ధమైంది. అర్హులైన కోటిమంది మహిళలకు శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా చీరెలు అందించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. తెల్లరేషన్‌కార్డులో పేరుండి, 18 ఏండ్లు నిండిన ఆడపడుచులకు చీరెలను అందిస్తారు. మరమగ్గాలపై తయారుచేసిన ఈ చీరెలను 33 జిల్లాలకు చేర్చారు. ఈసారి 287 డిజైన్లతో ఆకర్షణీయంగా తయారు చేశారు. బంగారు, వెండి జరీతో తీర్చిదిద్దారు. తయారీకి రూ.317 కోట్లు వెచ్చించారు. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని చీరెలను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర యంత్రాంగం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు స్వయం సహాయక సంఘాల ద్వారా భౌతిక దూరాన్ని పాటిస్తూ చీరెలను ఇంటింటికీ పంపిణీచేయనున్నారు. తెలంగాణ అడపడుచులు ఇంటింటా ఎంతో ఉత్సాహంగా జరుపుకొనే బతుకమ్మ పండుగకు పెద్దన్నగా, మేనమామ, తండ్రిగా సీఎం కేసీఆర్‌ బతుకమ్మ చీరెలను అందిస్తున్నారు. బతుకమ్మ చీరెల తయారీ, పంపిణీ వెనుక ముఖ్యమంత్రి ద్విముఖ వ్యూహం అనుసరించారు. సిరిసిల్ల, ఘర్షకుర్తి, వరంగల్‌లో మరమగ్గాలపై చీరెలను తయారుచేయించారు. మరమగ్గ నేతన్నలకు ఉపాధి కల్పించటం, అదే సమయంలో అడపడుచులకు చిరుకానుక అందించటం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్దేశం. ఈ చీరెల తయారీతో ఆరు నెలలపాటు 15వేల మంది నేతన్నలకు రెండు షిఫ్టుల్లో పనిదొరుకుతున్నది. ఆ ఫలితమే నేతన్నల ఆత్మహత్యలు లేకపోవటం. ఈ ఏడాది మొత్తం 98.50 లక్షల చీరెలు అవసరమవుతాయని అంచనా వేసి జిల్లాలకు చేరవేశారు. ఇందులో 89,28,700 చీరెలు 6.30 మీటర్లవి కాగా,  9,21,300 చీరెలు 9 మీటర్లవి ఉన్నాయి.logo