బుధవారం 03 జూన్ 2020
Telangana - May 17, 2020 , 23:47:15

కొడుకుకు పెళ్లి.. అయినా విధులకు వెళ్లి..

కొడుకుకు పెళ్లి.. అయినా విధులకు వెళ్లి..

రాయికల్‌ రూరల్‌ : కొన్ని గంటల్లో కొడుకు పెళ్లి.. బంధువులు, మిత్రులు, పిల్లలు, భాజాభజంత్రీలతో ఇళ్లంతా సందడిగా ఉంది. కానీ పెళ్లి పెద్ద మాత్రం ముహూర్త సమయం దాకా విధులు నిర్వర్తించాడు. కరోనా నేపథ్యంలో వృత్తినే దైవంగా భావించిన ఆ పారిశుధ్య కార్మికుడు విధులు ముగించుకున్నాకే వివాహానికి హాజరై అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం మైతాపూర్‌ గ్రామ పంచాయతీలో కొంత కాలంగా భూమరాజం పారిశుధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. 

తన కుమారుడి వివాహం ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు జరిగింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కట్టుబడి ఆదివారం ఉదయం విధులకు హాజరై తోటి కార్మికులతో కలిసి పనిచేశాడు. డ్యూటీ సమయం అయిన వెంటనే తన కుమారుడి వివాహ పనుల్లో నిమగ్నమయ్యాడు . ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ వృత్తి పట్ల చూపిన నిబద్దతకు గ్రామస్తులంతా భూమయ్యకు అభినందనలు తెలిపారు.  


logo