గురువారం 09 జూలై 2020
Telangana - Jun 15, 2020 , 01:12:03

కిర్గిస్థాన్‌లో సంగారెడ్డి విద్యార్థుల ఇక్కట్లు

కిర్గిస్థాన్‌లో సంగారెడ్డి విద్యార్థుల ఇక్కట్లు

  • భారత విమానాల ల్యాండింగ్‌కు కిర్గిస్థాన్‌ ప్రభుత్వం నిరాకరణ.. 
  • ఆన్‌లైన్‌లో బుక్‌చేసిన టికెట్లు రద్దు 

పటాన్‌చెరు: కిర్గిస్థాన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్న సంగారెడ్డి జిల్లాకు చెందిన 29 మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండియా నుంచి వచ్చే విమానం ల్యాండింగ్‌ను కిర్గిస్థాన్‌ ప్రభుత్వం నిరాకరించడంతో.. వారు స్వదేశానికి వచ్చేందుకు బుక్‌చేసుకున్న టికెట్లు రద్దయ్యాయి. భారత్‌లో అడుగుపెడతామని ఆశపడ్డ విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. జిల్లాలోని ఎద్దుమైలారం ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ నుంచి 25 మంది, పటాన్‌చెరు నుంచి ఇద్దరు, బీరంగూడ నుంచి ఇద్దరు విద్యార్థులు వైద్య విద్య చదివేందుకు కిర్గిస్థాన్‌కు వెళ్లారు. అక్కడ తెలుగు విద్యార్థుల సంఖ్య ఎక్కువే ఉన్నట్టు సమాచారం. లాక్‌డౌన్‌ సడలింపులతో వైద్య విద్యార్థులు భారత్‌కు వచ్చేందుకు సిద్ధమయ్యారు. రెట్టింపు ధరకు ఆన్‌లైన్‌లో విమాన టికెట్లు బుక్‌ చేసుకున్నారు. ఈ నెల 17న ప్రత్యేక విమానంలో విద్యార్థులు తొలివిడుతగా భారత్‌కు రావాల్సి ఉన్నది. ఈ పరిస్థితుల్లో కిర్గిస్థాన్‌ ప్రభుత్వం ఇండియా విమానాలు ల్యాండింగ్‌ అయ్యేందుకు అనుమతులు రద్దు చేసి.. టికెట్ల డబ్బు కొంతకాలం తరువాత తిరిగిస్తామని సమాచారం ఇచ్చింది. ఆందోళనకు గురయిన విద్యార్థులు.. తల్లిదండ్రులకు ఫోన్‌చేసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తమ పిల్లలను ఇండ్లకు వచ్చేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.


logo