శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 07, 2020 , 01:42:19

ఇసుక బుకింగ్‌ లక్ష క్యూబిక్‌ మీటర్లు

ఇసుక బుకింగ్‌ లక్ష క్యూబిక్‌ మీటర్లు

  • ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్లలో భారీగా ఆర్డర్లు
  • ప్రభుత్వ మినహాయింపుతో తవ్వకాలు 
  • నిర్మాణరంగానికి అనుమతితో డిమాండ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపులతో దాదాపు 42 రోజుల తర్వాత ఇసుక తవ్వకాలు మొదలయ్యాయి. రియల్‌ఎస్టేట్‌, నిర్మాణరంగాలకూ అనుమతులు ఇవ్వడంతో ఇసుకకు బుధవారం ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. అటు ఆన్‌లైన్‌, ఇటు ఆఫ్‌లైన్‌లో ఆర్డర్లు వెల్లువెత్తాయి. బుధవారం ఒక్కరోజే లక్ష క్యూబిక్‌ మీటర్ల ఇసుక బుకింగ్‌లు జరిగినట్టు మైనింగ్‌శాఖ అధికారులు తెలిపారు. ఇసుక తవ్వకంతోపాటు, సరఫరాకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపులతో పెద్దఎత్తున డిమాండ్లు వస్తున్నాయని వారు పేర్కొన్నారు. నిర్మాణరంగానికి అనుమతులు ఇవ్వడంతో బిల్డర్లు, భవన యజమానులు తిరిగి తమ పనులను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. 

భవననిర్మాణానికి అనుబంధంగా ఉన్న సిమెంట్‌, ఇనుము, ఇసుక, ఎలక్ట్రికల్‌, ప్లంబర్‌కు సంబంధించిన షాపులకు కూడా ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చింది. దీంతో భవన నిర్మాణంలో కీలకమైన ఇసుకకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ) బుధవారం నుంచే ఇసుక తవ్వకాలను మొదలుపెట్టింది. ఆన్‌లైన్‌లో బుకింగ్స్‌ను కూడా ఓపెన్‌చేసింది. టీఎస్‌ఎండీసీకి భారీసంఖ్యలో బల్క్‌ఆర్డర్లు వచ్చాయి. టీఎస్‌ఎండీసీ రాష్ట్రవ్యాప్తంగా 16 ఇసుక రీచ్‌లో తవ్వకాలు జరుపుతున్నది. ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ ద్వారా ఇసుకను రవాణా చేస్తున్నది. హైదరాబాద్‌ శివారు, పరిసరప్రాంతాల్లో భారీఎత్తున నిర్మాణాలు జరుగుతున్నాయి. 

ఇప్పటికే ఇండ్లను బుకింగ్‌ చేసుకున్నవారికి నిర్ణీత సమయంలో వాటిని అప్పగించాల్సి ఉండటంతో నిర్మాణదారులపై ఒత్తిడి బాగాపెరిగింది. వేసవికాలం కావడంతో నిర్మాణాలు మరింత ఎక్కువగా జరిపేందుకు కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి. పనుల్లేక భవన నిర్మాణ కార్మికులు సొంత రాష్ర్టాలకు వెళ్లేందుకు మొగ్గుచూపుతుండటంతో వీలైనంత త్వరగా పనులు ప్రారంభించి వారిని ఇక్కడే ఉంచుకునేలా సిద్ధమవుతున్నాయి. నిర్మాణదారులకు అవసరమైనంత మేర మొత్తం ఇసుకను వారంరోజుల్లో సరఫరా చేయడానికి టీఎస్‌ఎండీసీ చర్యలు చేపడుతున్నది.


logo