సోమవారం 23 నవంబర్ 2020
Telangana - Nov 12, 2020 , 01:02:20

ఆన్‌లైన్‌లో గిరిజన పెయింటింగ్స్‌ అమ్మకాలు

ఆన్‌లైన్‌లో గిరిజన పెయింటింగ్స్‌ అమ్మకాలు

  • ఏడాదిన్నరలో 30.42 లక్షల ఆదాయం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గిరిజన పెయింటింగ్‌లను విశ్వవ్యాప్తం చేయడమే కాకుండా, చిత్రకారులకు ఆదాయ వనరులు పెంపొందించడంపై తెలంగాణ గిరిజన సంక్షేమశాఖ దృష్టి సారించింది. ఆన్‌లైన్‌లో పెయింటింగ్‌ల అమ్మకాలను చేపట్టగా ఈ చిత్రాలకు ఆదరణ లభిస్తున్నది. గత ఏడాది జూన్‌ లో గిరిజన పెయింటింగ్స్‌ అమ్మకాలు, ప్రచారాన్ని ఆన్‌లైన్‌లో ప్రారంభించగా ఏడాదిన్నరలోనే 468 గిరిజన పెయింటింగ్స్‌ అమ్ముడు పోవడం విశేషం. ఒక్కో పెయింటింగ్‌కు రూ.6,500 చొప్పున మొత్తం రూ.30,42,000 ఆదాయం లభించింది.          

గిరిజన  సంప్రదాయ చిత్రాల వివరాలకు www.twd.telangana. gov.in, http://www.twd. telangana.gov.in ను సంప్రదించాలని ఆ శాఖ అధికారులు తెలిపారు.  గిరిజన సంప్రదాయ కళారూపాలు, పెయింటింగ్‌లను సిద్ధం చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ట్రైబల్‌ పెయింటర్స్‌ సొసైటీ ద్వారా చిత్రకారులను ప్రోత్సహిస్తారు. గిరిజనులైన గోండా, కోయా, నాయక్‌పోడ్‌లకు సంబంధించిన సంప్రదాయ పెయింటింగ్స్‌ సహజత్వం పోకుండా కాన్వాస్‌, బోర్డులపై వేసేలా గిరిజన యువతకు అవగాహన కల్పిస్తున్నారు.