ఆదివారం 31 మే 2020
Telangana - May 18, 2020 , 00:52:30

విత్తన విక్రయాలు షురూ

విత్తన విక్రయాలు షురూ

  • వ్యవసాయ పరిశోధన సంస్థలు, కృషి విజ్ఞాన కేంద్రాల్లో అమ్మకాలు 
  • 62 రకాల మేలైన విత్తనాలు
  • 15 వేల క్వింటాళ్లు సిద్ధం

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: వానకాలం సీజన్‌ కోసం ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం విత్తన విక్రయాలను ప్రారంభించింది. 19 రకాల పంటల్లో 62 రకాలకుపైగా మేలైన విత్తనాలు 15 వేల క్వింటాళ్లకుపైగా వ్యవసాయ వర్సిటీ సిద్ధంగా ఉంచింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వర్సిటీ పరిధిలోని వ్యవసాయ పరిశోధన సంస్థలు, కృషి విజ్ఞాన కేంద్రాల్లో వరి సహా మక్కజొన్న, కంది, పెసర, జొన్న, పచ్చిరొట్ట విత్తనాలను అందుబాటులోకి తెచ్చింది. లాక్‌డౌన్‌ కారణంగా ఈ ఏడాది విత్తన మేళా నిర్వహించడం లేదు.  వరి సాగు చేసే రైతులు స్వల్పకాలిక రకాలను ఎంచుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అధికశాతం రైతులు తెలంగాణ సోనా, బతుకమ్మ, సిద్ది తదితర సన్నరకాలపై ఆసక్తి చూపిస్తున్నారు. దిగుబడిపై భరోసా, నాణ్యత గల సన్న రకాల కోసం రాజేంద్రనగర్‌ వరి పరిశోధనా కేంద్రానికి రైతులు వస్తున్నారు. వ్యవసాయ పరిశోధన కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు ఉత్పత్తిచేసిన విత్తనాలను రైతులు అభివృద్ధి చేసుకుంటూ మూడు సీజన్ల వరకు వినియోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇతర వివరాలకోసం కిసాన్‌ కాల్‌ సెంటర్‌లోని 18001801551 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

తెలంగాణ సోనాకు డిమాండ్‌

ఈ ఏడాది ప్రభుత్వం సన్నరకం వరిని ప్రోత్సహించాలని నిర్ణయించడంతో రైతులు తెలంగాణ సోనా పట్ల ఆసక్తి చూపుతున్నారని వరి పరిశోధనా కేం ద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ చంద్రమోహన్‌ తెలిపారు. ఇది స్వల్పకాలిక ఆర్‌ఎన్‌ఆర్‌ 15048 రకమని, పంట 125 నుంచి 130 రోజుల్లో కోతకు వస్తుందని చెప్పారు. బాగా సన్నగా ఉండి, దిగుబడి కూడా ఎకరానికి 40 క్వింటాళ్ల వరకు వస్తుందన్నారు. నూక కూడా తక్కువగా ఉండటంతో మార్కెట్‌లో వీటికి మంచి డిమాండ్‌ ఉన్నదని, మిల్లర్లు కూడా వీటిని కొనడానికి సుముఖత చూపుతున్నారని చెప్పారు. వచ్చే వానకాలం సీజన్‌లో తాము సిఫారసుచేసే సన్న రకాల్లో మరొకటి జగిత్యాల సన్నలు ‘జేజేఎల్‌ 1798’ రకమని చంద్రమోహన్‌ తెలిపారు. 

ఇక దీర్ఘకాలిక రకాలు సాగు చేసుకోవాలనుకునే రైతు లు నిజామాబాద్‌, నల్లగొండలోని కొన్ని ప్రాంతా ల్లో, ఖమ్మం ప్రాంతంలో బీపీటీ 5204 సాంబమసూరి వేసుకోవచ్చని సూచించారు. దీనికంటే అధిక దిగుబడినిచ్చి, చీడపీడలను తట్టుకునేది సిద్ది రకమని, తమ విశ్వవిద్యాలయంలో అందుబాటులో ఉన్నదని చెప్పారు. ‘వరంగల్‌ వ్యవసాయ పరిశోధన కేంద్రం, కృషి విజ్ఞాన కేంద్రాల్లో అభివృద్ధి చేసిన మరో రకం సన్నాలు ‘డబ్ల్యూజీఎల్‌ 44’. వీటితోపాటు స్వల్పకాలిక రకాల్లో జగిత్యాల సాం బ, అంజన, ప్రత్యామ్నాయ రకాలను సాగుచేసుకోవచ్చు. ముఖ్యంగా దీర్ఘకాలిక రకాలను సాగుచేసుకోవాలనే రైతులు మాత్రమే ఇప్పుడు నార్లు పోసుకోవాలి. స్వల్పకాలిక, మధ్య రకాలను సాగుచేసే రైతులు జూన్‌ 15తర్వాత నార్లు పోసుకుంటే.. కోత సమయంలో దెబ్బతినకుండా మంచి దిగుబడులు వస్తాయి’ అని చంద్రమోహన్‌ చెప్పారు.


పత్తి విత్తనాలపై బార్‌, క్యూఆర్‌ కోడ్‌

  • నకిలీ విత్తనాలను అరికట్టేందుకు కేంద్రం నిర్ణయం
  • నిబంధనలు అమలయ్యేలా చూడాలని రాష్ర్టాలకు ఆదేశం

దేశవ్యాప్తంగా నాసిరకం పత్తి విత్తనాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర వ్యవసాయశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రతి ప్యాకెట్‌పై బార్‌/క్యూఆర్‌ కోడ్‌ తప్పనిసరిగా ముద్రించేలా చూడాలని రాష్ట్ర వ్యవసాయశాఖకు ఆదేశాలు జారీచేసింది. నకిలీ విత్తనాలను నిరోధించాలని, అనుమతిలేని విత్తన సరఫరాను అడ్డుకోవాలని రాష్ట్రాలకు సూచించింది.నిబంధనలకు అనుగుణంగా లేబులింగ్‌, లాట్‌ నంబర్‌ ఉండాలని, ఈ మేరకు విత్తన చట్టం 1966, 1986 సీడ్‌ రూల్స్‌, విత్తన కంట్రోల్‌ ఆర్డర్‌ 1983 ప్రకారం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నది. బార్‌/క్యూఆర్‌ కోడ్‌  విధానం ద్వారా విత్తనాన్ని ఉత్పత్తి చేసిన కంపెనీ, ప్రాంతం, మార్కెటింగ్‌ చేసిన సంస్థ, రిటైలర్‌ డీలర్‌, సాగు చేసిన రైతు.. ఇలా అన్ని వివరాలను తెలుసుకోవచ్చని తెలిపింది. 


logo