శనివారం 30 మే 2020
Telangana - Apr 01, 2020 , 01:53:22

వేతనాల్లో కోత తాత్కాలికమే

వేతనాల్లో కోత తాత్కాలికమే

  • ఆర్థిక పరిస్థితి కుదుటపడ్డాక తిరిగి చెల్లింపు
  • సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ వెల్లడి
  • ఉద్యోగుల సమస్యలపై సానుకూల పరిశీలన 
  • పనిచేస్తున్న వారికి ప్రోత్సాహకాలు
  • పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం  
  • ఢిల్లీ వెళ్లివచ్చిన వారి గుర్తింపు: సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఉద్యోగుల వేతనాల్లో కోత తాత్కాలికమేనని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కుదుటపడ్డాక తిరిగి చెల్లిస్తామన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కట్టడికి తీసుకొన్న చర్యలతో మంచి ఫలితాలు వస్తున్నాయని, పాజిటివ్‌ కేసులు తగ్గాయని చెప్పారు. ప్రభుత్వ పరిస్థితిని తెలుసుకొన్న ఉద్యోగులు, మంగళవారం తనను కలిసి జీతాల్లో కోత  నిర్ణయానికి మద్దతు తెలిపారని, స్థూల వేతనం(గ్రాస్‌ శాలరీ)లో కోత విధించాలని కోరారని పేర్కొన్నారు. ఇది పెద్ద సమస్యకాదని, పరిశీలించి నిర్ణయం తీసుకొంటామని చెప్పారు. 

ఈ ప్రత్యేక పరిస్థితిని అర్థంచేసుకోలేని కొందరు వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పారు. లాక్‌డౌన్‌తో వసూలుకావాల్సిన పన్నులతోపాటు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా రావడంలేదని చెప్పారు. ప్రత్యామ్నాయం లేకే తాత్కాలికంగా వేతనాల్లో కోత విధించామని, ఈ నిర్ణయంపై దేశవ్యాప్త చర్చ మొదలైందని తెలిపారు. ఏపీ, మహారాష్ట్ర ఇలాగే చేశాయని, ఇతర రాష్ర్టాలు ఈ మోడల్‌ను అనుసరించాలని యోచిస్తున్నాయని పేర్కొన్నారు. ఎవరికైనా ఇంతకంటే వేరే మార్గం లేదన్నారు. ఇంత పెద్ద సంక్షోభంలో అంతా కలిసికట్టుగా పనిచేస్తామని చూపించడానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుందని తెలిపారు.  ఇప్పుడు కట్‌ అయిన జీతం పరిస్థితి బాగున్నప్పుడు తిరిగి వస్తుందని చెప్పారు. అత్యవసర సర్వీసులకు సంబంధించి మాట్లాడుతూ పనికి, వేతనాల్లో తాత్కాలిక కోతకు ఎలాంటి సంబంధం లేదన్నారు. పని చేసినవారికి వేరే విధంగా ప్రోత్సాహకాలుంటాయని పేర్కొన్నారు. 

కరోనాపై విజయం సాధిస్తాం

కరోనా కట్టడికోసం ప్రభుత్వం మార్చి 14 నుంచి  చర్యలు తీసుకొన్నదని, రద్దీ ప్రాంతాలను మూసివేయడంతో వైరస్‌ వ్యాప్తి కాలేదని సోమేశ్‌కుమార్‌ చెప్పారు. 22న జనతా కర్ఫ్యూ నాటినుంచి, లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించారన్నారు. ప్రజల అవగాహన, సహకారం చూస్తే కరోనాపై త్వరలోనే విజయం సాధిస్తామన్న విశ్వాసం ఉన్నదని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ గడువు పెంపుపై చర్చ జరుగలేదని, మొదట 21 రోజుల ప్రణాళికే ఉన్నదని..23 రోజులు చేస్తున్నామని చెప్పారు. ఉద్యోగులు, అధికారులు, ప్రజలు కలిసి పనిచేస్తే త్వరలో కరోనాను కట్టడి చేయగలుగుతామని ధీమా వ్యక్తంచేశారు.  నిజాముద్దీన్‌లో ప్రత్యేక కార్యక్రమానికి వెళ్లిన వారికి వైరస్‌ సోకినట్టు తెలంగాణలోనే బయటపడిందని.. అధికారులంతా చాలా యాక్టివ్‌గా పనిచేస్తున్నారని చెప్పారు. ఢిల్లీ నుంచి జాబితా తెప్పించుకొని అందరినీ గుర్తించామన్నారు. కరోనా లక్షణాలున్న వారిని దవాఖానలకు తీసుకెళ్లి వైద్యం చేయిస్తున్నామని చెప్పారు. లక్షణాలు లేనివారిని కూడా క్వారంటైన్‌లో పెడుతున్నామని పేర్కొన్నారు. మర్కజ్‌కు వెళ్లి వచ్చినవారు స్వచ్ఛందంగా 104లో లేదా నేరుగా దవాఖానకు వచ్చి చెప్తే బాగుంటుందని.. లేకుంటే వాళ్ల కుటుంబసభ్యులు కూడా సమస్యలను ఎదుర్కొంటారని సీఎస్‌ పేర్కొన్నారు.

విద్యుత్‌ ఉద్యోగులకూ కోత వర్తింపు 

వేతనాల్లో కోతకు సంబంధించి ఆర్థికశాఖ ఇచ్చిన ఆదేశాలు విద్యుత్‌ ఉద్యోగులకు కూడా వర్తిస్తాయని ట్రాన్స్‌కో,జెన్‌కో సీఎండీ డీ ప్రభాకర్‌రావు మంగళవారం ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చారు. ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కమ్‌ల పరిధిలోని అన్ని స్థాయిల ఉద్యోగులు, పెన్షనర్లు, ఇతర క్యాటగిరీల ఉద్యోగులకు ఈ ఉత్తర్వులు అమలవుతా యని పేర్కొన్నారు.

ఆ ఉద్యోగులకు పూర్తి వేతనం !

ఉద్యోగ సంఘాల జేఏసీ తీర్మానం 

కరోనాపై పోరులో నిరంతరం సేవలందిస్తున్న ఉద్యోగులకు పూర్తిస్థాయిలో వేతనాలివ్వాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ.. ప్రభుత్వాన్ని కోరింది. మంగళవారం టీఎన్జీవో భవన్‌లో జేఏసీ అత్యవసరంగా సమావేశమై పలు తీర్మానాలు చేసినట్టు జేఏసీ చైర్మన్‌ కారం రవీందర్‌రెడ్డి, సెక్రెటరీ జనలర్‌ వీ మమత వెల్లడించారు. చాలా తక్కువస్థాయిలో వేతనాలు పొందుతున్న పెన్షనర్లకు, మార్చినెలలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తిచేశారు. ఈ అంశాలను సీఎస్‌ను కలిసి వివరించామని తెలిపారు.  ఈ సమావేశంలో జేఏసీ కార్యదర్శులు మామిళ్ల రాజేందర్‌, ఏనుగుల సత్యనారాయణ, ట్రెస్సా అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, జూనియర్‌ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పద్మాచారి, టీటీయూ అధ్యక్షుడు మణిపాల్‌రెడ్డి, టీఎన్జీవో నేతలు శ్రీనివాస్‌రావు, లక్ష్మణ్‌, ఎస్‌ఎం ముజీబ్‌, రాయకంటి ప్రతాప్‌, వీఆర్వోల సంఘం అధ్యక్షుడు సతీశ్‌, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల సంఘం ప్రతినిధి సంజీవ, పబ్లిక్‌ సెక్టార్‌ అధ్యక్షుడు రాజేశం, వర్సిటీ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు మధూకర్‌, ఖాదర్‌, పోలీస్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo