మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 26, 2020 , 21:33:22

సీఎం సహాయ నిధికి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం

సీఎం సహాయ నిధికి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం

హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ ఒక నెల గౌరవ వేతనం మొత్తం రూ.9,51,17,500లను ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు టిఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, జడ్పీ చైర్ పర్సన్లు, జడ్పిటిసిలు, ఎంపిపిలు, ఎంపిటిసిలు, సర్పంచులు తమ అంగీకారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకునే చర్యల కోసం తమ ఒక నెల గౌరవ వేతనం డబ్బులు ఉపయోగించుకోవాలని వారు కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా వల్ల తెలంగాణ ప్రజలకు ముప్పు వాటిల్లకుండా చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నాలకు స్పూర్తి పొంది, తమ ఒక నెల గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వారు తెలిపారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఆపద సమయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చూపిన ఔదార్యం ఎంతో స్పూర్తిదాయకమైనదని ముఖ్యమంత్రి అభినందించారు. 

  • జిహెచ్ఎంసిలో మేయర్, డిప్యూటీ మేయర్ తో కలుపుకుని టిఆర్ఎస్ పార్టీకి 99 మంది కార్పొరేటర్లున్నారు. వీరి ఒక నెల వేతనం రూ.6,57,000. ఈ మొత్తాన్ని సిఎం సహాయనిధికి జమ చేయనున్నారు. 
  • హైదరాబాద్ మినహా రాష్ట్రంలో 12 మున్సిపల్ కార్పొరేషన్లున్నాయి. మొత్తం 12 కార్పొరేషన్లలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన వారే మేయర్లు, డిప్యూటీ మేయర్లుగా ఉన్నారు. 491 మంది కార్పొరేటర్లు టిఆర్ఎస్ పార్టీ వారున్నారు. వీరందరి ఒక నెల వేతనం మొత్తం రూ.36,64,000 సిఎం సహాయనిధికి అందివ్వనున్నారు. 
  • 114 మున్సిపాలిటీలలో చైర్ పర్సన్లు, 106 మున్సిపాలిటీలలో వైస్ చైర్ పర్సన్లు టిఆర్ఎస్ పార్టీకి చెందిన వారున్నారు. మొత్తం మున్సిపాలిటీలలో టిఆర్ఎస్ కౌన్సిలర్లు 2,404 మంది ఉన్నారు. వీరందరి నెల వేతనం రూ.84,26,500. ఈ మొత్తాన్ని కూడా సిఎం సహాయ నిధికి జమ చేయనున్నారు. 
  • రాష్ట్రంలో 32 జడ్పీలలోనూ టిఆర్ఎస్ పార్టీకి చెందిన వారే చైర్ పర్సన్లున్నారు. వీరందరి నెల వేతనం రూ.32 లక్షలు. 449 మంది టిఆర్ఎస్ జడ్పీటిసిలున్నారు. వీరందరి వేతనం రూ.44,90,000. 441 మంది టిఆర్ఎస్ ఎంపిపిలున్నారు. వీరి నెల వేతనం రూ.44,10,000. 3,571 మంది టిఆర్ఎస్ ఎంపిటిసిలున్నారు. వీరి వేతనం రూ.1,78,55,000. టిఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచులు మొత్తం 10,483 మంది ఉన్నారు. వీరి నెల వేతనం రూ.5,24,15,000. జడ్పీ చైర్ పర్సన్లు, జడ్పీటిసిలు, ఎంపిపిలు, ఎంపిటిసిలు, సర్పంచుల ఒక నెల వేతనం రూ.8,23,70,000 ఈ మొత్తాన్ని కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి అందివ్వనున్నారు. 
  • మొత్తంగా టిఆర్ఎస్ పార్టీకి చెందిన 18,190 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమకు లభించే ఒక నెల గౌరవ వేతనం మొత్తం రూ.9,51,17,500లను ముఖ్యమంత్రి సహాయ నిధికి జమ చేస్తున్నట్లు ప్రకటించారు.
  • టిఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు, లోకసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇప్పటికే తమ ఒకనెల వేతనం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు. దాంతో పాటు ఎంపిలు ఒక్కొక్కరు తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏడాదికి వచ్చే 5 కోట్ల రూపాయలను, ఎమ్మెల్యేలు 3 కోట్ల  రూపాయలను సిఎం సహాయ నిధికి అందించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇళా ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ద్వారా దాదాపు రూ.500 కోట్లు సిఎం సహాయనిధికి సమకూరనున్నాయి.
  • అటు చట్టసభల్లోనూ, ఇటు స్థానిక సంస్థల్లోనూ పెద్ద సంఖ్యలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చి,  తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచారు.


logo
>>>>>>