e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home Top Slides ఆర్టీసీ ఉద్యోగులకు త్వరలో జీతాల పెంపు

ఆర్టీసీ ఉద్యోగులకు త్వరలో జీతాల పెంపు

ఆర్టీసీ ఉద్యోగులకు త్వరలో జీతాల పెంపు
  • చేతినిండా పని.. కడుపునిండా తిండి
  • సంపద పెంచాలి.. ప్రజలకు పంచాలి
  • ప్రొబేషనరీ పీఎస్‌లకు ఇకపై పూర్తి వేతనం
  • మన రాష్ట్రంలోనే ఉద్యోగుల జీతాలు అధికం
  • కేంద్ర ఉద్యోగులూ స్టేట్‌ సర్వీస్‌ కోరుతున్నరు
  • తాత్కాలిక ఉద్యోగులకూ పీఆర్సీ ఇచ్చాం
  • అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్

‌హైదరాబాద్‌, మార్చి 26, (నమస్తే తెలంగాణ): త్వరలోనే ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలు పెంచుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఆర్టీసీని కాపాడుకొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో ఉద్యోగులకు చేతినిండా పని కల్పించి సంపదను మరింత పెంచి, దానిని ప్రజలందరికీ తారతమ్యాలు లేకుండా పంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం తెలిపారు. ఎన్నో ఏండ్లుగా కొనసాగుతన్న పోడుభూముల సమస్యకు చరమగీతం పాడి, ఆ భూముల రైతులకు రైతుబంధు వర్తింపజేస్తామని ప్రకటించారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్‌ శుక్రవారం మాట్లాడారు. గ్రామాల్లో పచ్చదనాన్ని పెంచాలన్న ఉద్దేశంతోనే పంచాయతీ కార్యదర్శులకు ప్రొబేషనరీ విధానం పెట్టామని తెలిపారు. ప్రొబేషనరీ పీరియడ్‌ను మరో ఏడాది పెంచుతూనే వారికి రెగ్యులర్‌ పంచాయతీ కార్యదర్శుల మాదిరిగా వచ్చే నెల నుంచే వేతనాలు ఇస్తామని ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ ప్రంసంగం ఆయన మాటల్లోనే..

ఆర్టీసీని కాపాడుకుంటం
చాలా గర్వంగా చెప్తున్నా.. నేను రాజకీయాల కోసం ఈ మాటలు చెప్పడంలేదు. నేను ఉద్యమం నడిపిన రోజుల్లో టీఎన్జీవో సహా అనేక ఉద్యోగ సంఘాలు తెలంగాణ సోయి తోటి ఉద్యమంలో అద్భుతంగా పనిచేశాయి. బెదిరింపులకు, ఒత్తిళ్లకు కూడా లొంగలేదు. ఉద్యమ సమయంలో ఆర్టీసీ ఉద్యోగులకు కూడా నేను చాలాసార్లు భరోసా ఇచ్చాను. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఎస్‌ఆర్టీసీని కాపాడుతున్నం. బడ్జెట్‌లో రూ.3వేల కోట్లు పెట్టినం. ప్రతినెలా డబ్బులు ఇస్తున్నం. సంస్థను కాపాడేందుకు అవసరమైన చర్యలు ఇంకా తీసుకుంటం. రవాణాశాఖ మంత్రితో చర్చించి ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలు త్వరలోనే పెంచుతం.

చేతినిండాపని.. కడుపు నిండా తిండి
భగవంతుడి దయవల్ల రాష్ట్ర సంపద ఇట్లానే పెరగాలని, ఉద్యోగుల జీతాలు మున్ముందు మరింత పెరగాలని కోరుకుంటున్న. చేతినిండా పని.. కడుపునిండా తిండి. ఇది మా విధానం. పొలిటికల్‌ బ్యూరోక్రసీ, అఫీషియల్‌ బ్యూరోక్రసీ, చిరుద్యోగులు అంతా కలిసికట్టుగా క్రమశిక్షణతో పనిచేసి సంపదను పెంచాలి. పెంచిన సంపదను అందరికీ పంచాలి. తారతమ్యాలు తగ్గించాలన్నదే మా ప్రయత్నం. మా పరిధిలో ఉన్నంతలో, చేయగలినంతలో చిరుద్యోగులకు కూడా ఎంతో కొంత వెసులుబాటు వచ్చేలా జీతాలు పెంచుతూ పోతున్నం. భవిష్యత్తులో కూడా భగవంతుడి దయవల్ల మరింత పెరుగుతాయనే ఆశిస్తున్నం. ఎందుకంటే డేర్‌ టు డ్రీమ్‌ అన్నారు పెద్దలు.. కలగనకపోతే తెలంగాణనే వచ్చేది కాదు.. ఎక్కడోళ్లు అక్కడ చేతులు ముడుచుకుని ‘ఇది అయ్యేది కాదు.. పొయ్యేది కాద’ని పోయిన రోజున నేను, నాతోపాటు పిడికెడు మందిమి తెలంగాణ రాష్ట్ర సాధన కలగని, బయల్దేరాం. ఆకల సాకారమైంది. దానిలో భాగంగానే ఇవన్నీ నెరవేరుతున్నయి.

స్టేట్‌ సర్వీస్‌లోకి తీసుకోవాలని అడుగుతున్నరు
పీఆర్సీ ఫైనల్‌ చేసేటప్పుడు సీఎస్‌, ఇతర కార్యదర్శులు నాతో కూర్చున్నారు.. వాళ్లు ‘ఆల్‌ ఇండియా సర్వీస్‌లో తక్కువ జీతం ఉన్నది. మమ్మల్ని కూడా స్టేట్‌ సర్వీస్‌లోకి తీసుకోండి సర్‌’ అని అన్నరు. ఫైనాన్స్‌ సెక్రటరీ రామకృష్ణారావు మరో అడుగు ముందుకేసి.. ‘రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కాదు సార్‌.. మాకు ఎలక్ట్రిసిటీ బోర్డు ఉద్యోగుల జీతాలు ఇవ్వండి’ అని అన్నారు (సీఎం కేసీఆర్‌ సహా సభలో అంతా నవ్వులు..). దేశంలోనే అత్యుత్తమ జీతాలు పొందే ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు మన తెలంగాణ విద్యుత్తు ఉద్యోగులే. దేశంలోనే అత్యుత్తమ వేతనాలు పొందే ఉద్యోగులు మన తెలంగాణ ఉద్యోగులు. మేమేం ప్రజల సంపద దోచి ఉద్యోగులకు పెట్టడం లేదు. వాళ్లు కూడా ప్రజల్లో భాగమే. 9 లక్షల కుటుంబాలంటే దాదాపు 40 లక్షల జనాభా. వాళ్లు, వాళ్లతోపాటు చిరు ఉద్యోగులు గౌరవంగా బతకాలని జీతాలు పెంచినం. హోంగార్డులు, అంగన్‌వాడీలు, ఆశావర్కర్లు.. అన్ని క్యాటగిరీలకు జీతాలు పెంచినం.

చిరుద్యోగులకూ పీఆర్సీ

నాటి కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాలు చిన్న ఉద్యోగులను ఏనాడూ పట్టించుకోలేదు. ప్రభుత్వఉద్యోగులకు మాత్రమే ఏ రాష్ట్రంలోనైనా పీఆర్సీ ప్రకటిస్తరు. కానీ గత పీఆర్సీ నుంచి తాత్కాలిక ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చాం. ఆరులక్షల పైచిలుకు తాత్కాలిక ఉద్యోగులు ఉన్నరు. వీళ్లు వాళ్లు అన్న తేడా లేకుండా 9.17 లక్షలమందికి జీతాలు పెంచినం. గతంలో హోంగార్డులకు రూ.9 వేలు జీతం ఉంటే ఈ రోజు రూ.26,325 వస్తున్నది. దేశంలో ఇంత ఎక్కువ జీతాలు ఏ రాష్ట్రంలోనూ లేవు. చాలా రాష్ర్టాల్లో హోంగార్డులకు నెలకు పదిరోజులే పని ఇస్తారు. కానీ తెలంగాణలో నెలంతా పని ఇచ్చి వాళ్ల కడుపులు నింపుతున్నం. జూనియర్‌ అసిస్టెంట్‌కు నాడు రూ.16,918 జీతం ఉంటే.. ఇప్పుడు రూ.40 వేలకు చేరింది. గతంలో వీఆర్‌ఏలకు రూ.5 వేల జీతం ఉంటే ఇప్పుడు రూ.13,910 ఇస్తున్నం. కాంట్రాక్టు లెక్చరర్లు గతంలో అర్ధాకలితో రూ.18 వేల జీతంతో బతికితే ఇప్పుడు రూ.48 వేలు ఇస్తున్నం. ఎస్జీటీ టీచర్లకు రూ.19,712 నుంచి రూ.46,848 జీతం పెంచాం. తెలంగాణ ఏర్పడితే దేశంలో మేమే ఎక్కువ వేతనం పొందే ఉద్యోగులం అని మా ఉద్యోగులు కాలర్‌ ఎగరేసి చెప్పుకొనే రోజు వస్తదని చెప్పిన.. ఇప్పుడది సాధ్యమైందని గర్వంగా ప్రకటిస్తున్న.

పంచాయతీ కార్యదర్శులకు పూర్తి వేతనం
గతంలో మురికి కూపాలుగా ఉన్న గ్రామాలు ఇప్పుడు బాగుపడుతున్నయి. గతంలో మొక్కలు పెంచాలని చెప్తే ఏ అధికారీ పట్టించుకోలేదు. అందుకే నిబంధనలు కఠినతరం చేశాం. పంచాయతీ కార్యదర్శులకు ప్రొబెషనరీ పెట్టాం. ఇది వ్యక్తిగతంగా నాకు అస్సలు ఇష్టంలేదు. కానీ పని జరగాలి. మేం కడుపులు నింపినోళ్లమే తప్ప.. ఎవరి కడుపులు కొట్టినోళ్లం కాదు. మొక్కలు పెరగకపోతే మీ ఉద్యోగాలు పోతాయని చెప్తేనే ఇప్పుడు చాలాచోట్ల పచ్చదనం కనిపిస్తున్నది. మొక్కలు పెరగాలని, గ్రామాలు పచ్చబడాలన్న సదుద్దేశం తప్ప దురుద్దేశం మాకులేదు. ప్రొబేషనరీలో ఉన్న పంచాయతీ కార్యదర్శులకు కూడా పూర్తి వేతనం వచ్చేనెల నుంచే ఇస్తామని ప్రకటిస్తున్నా. ప్రొబేషనరీ పీరియడ్‌ మాత్రం నాలుగేండ్లకు పెంచుతం. రాష్ట్రంలో 90% మంది టీఆర్‌ఎస్‌ సర్పంచ్‌లే ఉన్నరు. 85% మొక్కలు బతుకకుంటే నౌకరి పోతది అని సర్పంచ్‌లకు కూడా స్పష్టంగా చెప్పినం. ప్రజల మంచి కోసం చేస్తున్నం కాబట్టి మేం ఎవరికీ భయపడం.

వేతన పెంపు ప్రకటనపై ఆర్టీసీ ఉద్యోగుల హర్షం

ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలు పెంచుతామంటూ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించడంపై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. సీఎం కేసీఆర్‌ తమలో మనోధైర్యాన్ని నింపారని టీఎంయూ నేత థామస్‌రెడ్డి ఆనందం వ్యక్తంచేశారు. ఆర్టీసీ ఉద్యోగుల పక్షాన సీఎం కేసీఆర్‌కు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీఆర్సీ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగుల ప్రస్తావన లేకపోవడంతో తీవ్ర ఆందోళన చెందారన్న విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లామని, అచంచలమైన ప్రేమతో సానుకూల నిర్ణ యం తీసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. రూ.3 వేల కోట్ల బడ్జెట్‌, సిబ్బంది వేతనాల పెంపు నిర్ణయంపై రవాణాశాఖ మంత్రి పువ్వాడకు కృతజ్ఞతలు తెలిపారు. వేతనాల పెంపు ప్రకటనపై ఎన్‌ఎంయూ అధ్యక్షుడు కమల్‌రెడ్డి, ఉపప్రధాన కార్యదర్శి అశోక్‌, టీజేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే హనుమంత్‌ ముదిరాజ్‌ హర్షం వ్యక్తంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు డిపోల వద్ద ఆర్టీసీ ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు. కరీంనగర్‌ డిపో-2 ఆవరణలో సీఎం కేసీఆర్‌ రవాణామంత్రి పువ్వాడ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆర్టీసీ ఉద్యోగులకు త్వరలో జీతాల పెంపు

ట్రెండింగ్‌

Advertisement