శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 03, 2020 , 17:42:32

మహిళలకు అండగా ‘సఖీ..వన్ స్టాప్ సెంటర్’

మహిళలకు అండగా ‘సఖీ..వన్ స్టాప్ సెంటర్’

జయశంకర్ భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సఖీ..వన్ స్టాప్ సెంటర్ ను రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ..సఖీ అంటే నేస్తం..మన దోస్త్. దోస్త్ అంటే నేనున్నా అని భరోసా ఇచ్చే వ్యక్తి. మహిళలకు అలాంటి భరోసా ఇచ్చే కేంద్రమే సఖీ..వన్ స్టాప్ సెంటర్ అని అన్నారు. మహిళలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నా..దాడులు జరుగుతున్న నేపథ్యంలో వారికి అండగా నిలబడటానికి సఖీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సత్యవతి వెల్లడించారు. 

బాధిత మహిళలకు అన్ని రకాలుగా పరిష్కారం చూపేందుకు సఖీ కేంద్రాలు పని చేస్తాయి. బాధల్లో ఉన్న మహిళలు అందరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వారికి చేయూతనివ్వడంతోపాటు వారిలో ధైర్యాన్ని, రక్షణ, నమ్మకాన్ని కలిగించేది సఖీ కేంద్రమని చెప్పారు. సఖీ కేంద్రానికి మహిళా పోలీస్ ఆఫీసర్ ను కేటాయించాలని సీఎం కేసీఆర్ ను కోరుతాం. ఫ్రెండ్లీ పోలీస్ అంటే దొంగ పనులు చేసేవారిని పక్కన కూర్చోబెట్టుకోవడం కాదు..అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ, బాధితుల పట్ల స్నేహపూర్వకంగా ఉండాలని మంత్రి సత్యవతి పోలీసులను కోరారు. 


దేశవ్యాప్తంగా సఖీ కేంద్రాలున్నా..రాష్ట్రంలో నిర్వహించే సఖీ కేంద్రాలు అన్ని విధాలా సమృద్ధిగా ఉండాలని వాటికి అవసరమైనన్ని నిధులు ప్రభుత్వం ఇస్తోంది. బాల్య వివాహాలు ఆపాలని, 18 ఏళ్ళు నిండిన వారికి వివాహం చేస్తే 1,00,116 రూపాయలు కల్యాణ లక్ష్మీ కింద ఇస్తుండడం మంచి ఫలితాలు ఇస్తోంది. మహిళల సంక్షేమమే కాదు వారి భద్రత ముఖ్యమని ఈ సఖీ కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటున్నామని మంత్రి సత్యవతి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మహిళలకు టిఆర్ఎస్ ప్రభుత్వం కవచంలా పని చేస్తుందనే నమ్మకాన్ని ఈ సెంటర్లు కల్పించాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ శ్రీహర్షిణి, ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ వెంకట రాణి, వికలాంగుల కార్పొరేషన్ తొలి చైర్మన్ వాసుదేవరెడ్డి, కలెక్టర్ అబ్దుల్ అజీమ్, ఏఎస్పీ శ్రీనివాస్,  సఖీ సెంటర్స్ ఇంచార్జి గిరిజ, కెఎస్ఆర్ ట్రస్ట్ అధ్యక్షులు రామ్ నర్సిహ్మారెడ్డి, ఇతర అధికారులు, నేతలు పాల్గొన్నారు. 


logo