శనివారం 29 ఫిబ్రవరి 2020
సంత్ సేవాలాల్ జ‌యంతి.. సంబ‌రాల్లో పాల్గొన్న స్పీక‌ర్‌, మంత్రులు

సంత్ సేవాలాల్ జ‌యంతి.. సంబ‌రాల్లో పాల్గొన్న స్పీక‌ర్‌, మంత్రులు

Feb 14, 2020 , 15:25:42
PRINT
సంత్ సేవాలాల్ జ‌యంతి.. సంబ‌రాల్లో పాల్గొన్న స్పీక‌ర్‌, మంత్రులు

హైద‌రాబాద్ :  గిరిజన సంక్షేమ సంఘం - సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఇవాళ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 281 వ జయంతి ఉత్సవాలు జ‌రిగాయి.  సేవాలాల్ మహారాజ్ కేవలం గిరిజన ఆరాధ్య దైవం కాదు...అందరి ఆరాధ్య దైవమ‌ని  స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు.  సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు అధికారికంగా తెలంగాణలో తప్ప దేశంలో ఇంకెక్కడా జరపడం లేదంటే ఇది మన రాష్ట్ర గొప్పతనమ‌న్నారు.  మన రాష్ట్రంలో అత్యధిక సంత్ సేవాలాల్ గుడులు ఉన్నాయని స్పీక‌ర్ తెలిపారు.  సీఎం కేసీఆర్ గారు గిరిజనులు అభివృద్ధికి, సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తున్నారన్నారు.  అత్యధిక గిరిజన గురుకులాలు ఏర్పాటు చేశారమ‌న్నారు.  

రాష్ట్ర గిరిజన ప్రజలందరికీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్.. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 281వ జయంతి దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశంలోనే అందరికంటే గొప్పగా, ఆదర్శవంతంగా పాలిస్తున్నారని మంత్రి స‌త్య‌వ‌తి అన్నారు. ఈ రాష్ట్రంలో అన్ని కులాలు, మతాలను సమానంగా గౌరవిస్తూ సంప్రదాయాలను, ఆచారాలను కాపాడుతున్నారన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు కూడా ఘనంగా జరుపుకునే విధంగా ఏర్పాట్లు చేశామ‌ని మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ తెలిపారు.  బంజారాహిల్స్ లో బంజారాలకు ప్రాతినిధ్యం లేకపోతే అక్కడ దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన భూమిని కేటాయించి అక్కడ బంజారా భవన్, కొమురం భీమ్ భవన్ నిర్మాణం చేప‌డుతున్న‌ట్లు చెప్పారు.  త్వరలోనే ఆ భవనాలను సీఎం కేసీఆర్ గారి చేతుల మీద ప్రారంభించనున్న‌ట్లు మంత్రి స‌త్య‌వ‌తి తెలిపారు. 

300 ఏళ్ల క్రితమే మనం ఎలా జీవించాలో చెప్పిన గొప్పవారు సంత్ సేవాలాల్, కానీ దురదృష్టవశాత్తు అన్ని తెలిసి కూడా సంత్ సేవాలాల్ మహారాజ్ చెప్పినవి పాటించడం లేదని మంత్రి తెలిపారు. సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో నడవాల్సిన బాధ్యత అంద‌రిపై ఉంద‌ని మంత్రి స‌త్య‌వ‌తి అన్నారు.   

బంజారాలను ఇన్ని రోజులు ఓటు బ్యాంకు గా అన్ని రాజకీయ పార్టీలు వాడుకుంటే...సీఎం కేసీఆర్ గారు మాత్రం బంజారాహిల్స్ లో వారికి ఎకరం భూమిలో బంజారా భవన్ నిర్మిస్తున్నారు, తండాలను గ్రామ పంచాయితీలుగా చేశారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బంజారాలు అంటే నాడు బ్రిటిష్ కు వ్యతిరేకంగా పోరాడిన ధైర్యవంతులన్నారు.  గిరిజనులకు అత్యధిక గురుకులాలు పెట్టిన ఘనత సీఎం కేసీఆర్ గారిదేన‌న్నారు. 

హోమ్ శాఖ మంత్రి శ్రీ మహమూద్ అలీ, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటెల రాజేందర్,  ఎంపీలు శ్రీ బీబీ పాటిల్, శ్రీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, మీర్ పేట మేయర్ దీప్ లాల్, రాష్ట్ర సమాచార కమిషనర్ శ్రీ గుగులోత్ శంకర్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, ఇత‌రులు కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. 


logo