మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 12, 2020 , 01:16:12

2500 కాలేజీల్లో సేఫ్టీక్లబ్‌లు

2500 కాలేజీల్లో సేఫ్టీక్లబ్‌లు
  • రాష్ట్రవ్యాప్తంగా విడుతలవారీగా ఏర్పాటు
  • అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో డీజీపీ మహేందర్‌రెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/చిక్కడపల్లి: రాష్ట్రంలోని దాదాపు 2,500 డిగ్రీ కళాశాలల్లో విడుతలవారీగా సేఫ్టీక్లబ్‌లను ఏర్పాటుచేస్తామని డీజీపీ మహేందర్‌రెడ్డి చెప్పా రు. వీటిలో లక్షమందిని సభ్యులుగా చేర్పించి.. వారిని విద్యార్థినులు, పిల్లలు, యువతులు, మహిళల భద్రతకు స్వచ్ఛందంగా ఉపయోగించనున్నట్టు తెలిపారు. పోలీస్‌శాఖలోని మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో బుధవారం బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కల్యాణమండపంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళాదినోత్సవంలో డీజీపీ మాట్లాడారు. మహిళల భద్రతకోసం తీసుకొచ్చిన షీటీమ్స్‌ పనితీరును ప్రజలు ప్రశంసిస్తున్నారని అన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం దోషులకు శిక్షలుపడే సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. రాష్ట్రంలో నేరంచేస్తే వెంటనే శిక్ష పడుతుందనే భయాన్ని కలిగించడంలో పోలీస్‌శాఖ సఫలమైందని డీజీపీ పేర్కొన్నారు. ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌ మాట్లాడుతూ.. లింగవివక్షకు వ్యతిరేకంగా కళాశాలస్థాయిలో పాఠ్యాంశాలను ప్రవేశపెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని  చెప్పారు. మహిళా భద్రతా విభాగం ఐజీ స్వాతిలక్రా మాట్లాడుతూ.. ప్రజల ఆలోచనాదృక్పథంలో మార్పు వచ్చినప్పుడే సామాజిక మార్పు సాధ్యమన్నారు. ఇందుకు సేఫ్టీక్లబ్‌లు దోహదపడుతాయని చెప్పారు.


logo
>>>>>>