రాష్ట్రవ్యాప్తంగా సద్దుల బతుకమ్మ పండుగను మహిళలు సంబురంగా జరుపుకొన్నారు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చిన ఆడబిడ్డలు సోమవారం ఆడిపాడారు. తొమ్మిది రోజులపాటు సాగిన పూల పండుగలో మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చివరి రోజు ‘మల్లొచ్చే పండుగకు మళ్లీ రావమ్మా..’ అంటూ పెద్ద బతుకమ్మలను సాగరంలో నిమజ్జనం చేస్తూ సాగనంపారు. రాష్ట్రంలోనే కాకుండా దేశవిదేశాల్లో ఉన్న తెలంగాణ బిడ్డలు బతుకమ్మ పండుగను వేడుకగా నిర్వహించారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, దుబాయ్, కెనడా తదితర దేశాల్లో ఎన్నారైలు ముగింపు వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.
– హైదరాబాద్, నమస్తే తెలంగాణ