ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Oct 21, 2020 , 15:20:56

అమరుల త్యాగాలు.. వర్తమానానికి స్ఫూర్తి : మంత్రి పువ్వాడ

అమరుల త్యాగాలు.. వర్తమానానికి స్ఫూర్తి : మంత్రి పువ్వాడ

ఖమ్మం: దేశ రక్షణ రంగంలో పోలీస్ అమరవీరుల త్యాగాలు అజరామరంగా నిలుస్తున్నాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  పేర్కొన్నారు. అటువంటి అమరవీరులను స్మరించుకోవాల్సిన బాధ్యత దేశ పౌరులుగా మనమీద ఉందన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద ఆయన అమర పోలీసులకు ఘనంగా నివాళులు అర్పించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తాము సమిధలుగా మరి దేశానికి రక్షణ వలయంగా నిలిచి అసువులు బాసిన అమరపోలీసులు వర్తమానానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తూరన్నారు. ప్రజల రక్షణ కోసం ఏర్పడ్డ వ్యవస్థ దేశ రక్షణ, అంతర్గత భద్రత, శాంతి భద్రతలతో పాటు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కూడా వారి సేవలు కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు. గడచిన 20 రోజులుగా తెలంగాణా రాష్ట్రంలో సంభవిస్తున్న పరిణామాలను ప్రత్యక్షంగా మనం చవి చూస్తున్నామన్నారు.


కొవిడ్ లాంటి విపత్కర పరిస్థితులతో పాటు అనేక విపత్తులను దీటుగా ఎదుర్కొని ప్రజా సేవలు, పౌర సేవలు అందిస్తూ విధి నిర్వహణలో అసువులు బాసిన వారిని స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు. అనంతరం కొవిడ్ కష్ట కాలంలో సాహసోపేతమైన సేవలు అందించిన పోలీస్ కమిషనర్  తాఫ్సిర్ ఇక్బాల్, పోలీస్ అధికారులు, సిబ్బందికి మెమెంటో, ప్రశంసా పాత్రలు  అందజేసి సత్కరించారు. అమరుల కుటుంబాలతో మాట్లాడారు. వారి అభ్యర్థన మేరకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి లక్ష్మణ్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు డీసీపీలు మురళీధర్, పూజ,  ఏసీపీలు, సీఐ లు సిబ్బంది ఉన్నారు.