శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 08, 2020 , 03:02:21

నవంబర్‌ 1 నుంచి కాలేజీలు

నవంబర్‌ 1 నుంచి కాలేజీలు

  • బడులపై పండుగల తర్వాతే నిర్ణయం
  • అందరికీ ఆన్‌లైన్‌ తరగతులు అందేలా చర్యలు
  • మంత్రుల సబ్‌ కమిటీ సమావేశంలో నిర్ణయం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పండుగల తర్వాత పరిస్థితులను సమీక్షించి పాఠశాలలు ప్రారంభించే విధంగా నిర్ణయం తీసుకోవాలని మంత్రుల సబ్‌ కమిటీ నిర్ణయించింది. సీఎం కేసీఆర్‌ మార్గదర్శనంలో ఈ మేరకు తుది నిర్ణయం వెలువడనుంది. యూజీసీ, ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం ఉన్నతవిద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న కాలేజీలు నవంబర్‌ 1 నుంచి యథావిధిగా ప్రారంభమవుతాయి. విద్యాసంస్థలు ప్రారంభమైతే విద్యార్థుల ఆరోగ్యపరిస్థితిని ఎప్పటికపప్పుడు పరిశీలించేందుకు వైద్య,ఆరోగ్యశాఖ సహకారం తీసుకోవాలని నిర్ణయించింది. బుధవారం ఎంసీహెచ్‌ఆర్డీలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, సత్యవతిరాథోడ్‌తో కూడిన సబ్‌కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కొవిడ్‌ నేపథ్యంలో రాష్ట్రంలో విద్యాసంవత్సరం ఆగిపోకుండా ఉండేందుకు డిజిటల్‌ తరగతులు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ సూచించారని చెప్పారు. రాష్ట్రంలోని పాఠశాలలను స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకురావాలని సీఎం కేసీఆర్‌ సూచించినందున ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో 96% మందికి టీవీలున్నాయని, 40% మందికి ఇంటర్నెట్‌ సదుపాయం ఉన్నదని తెలిపారు. 86% మందికి ఆన్‌లైన్‌ విద్య అందుతున్నట్టు సర్వేలో తేలిందని పేర్కొన్నారు. కేంద్ర నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌ విద్య తప్పనిసరి అవుతుందని, అందరికీ అందేలా చూడటమే ప్రభుత్వం ముందున్న లక్ష్యమన్నారు. కొవిడ్‌ నిబంధనల మేరకు సగం మందితోనే తరగతులు నిర్వహించాల్సి ఉన్నందున మిగతా వారికి ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించాల్సి ఉంటుందని చెప్పారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ.. చదువుతోపాటు విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని తెలిపారు. సబ్‌ కమిటీ నిర్ణయాలు ప్రైవేటు పాఠశాలలకూ వర్తిస్తాయన్నారు. మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంలో విద్య అందరికీ సమానమేనని, వివిధశాఖల ఆధ్వర్యంలోనడుస్తున్న విద్యాలయాల్లో ఎలాంట బేధాలు లేకుండా విద్యావ్యవస్థ నడిపించాలన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయుల విషయంలో నిబంధన ఒకే విధంగా ఉండాలని పేర్కొన్నారు. మంత్రి సత్యవతిరాథోడ్‌ మాట్లాడుతూ.. పాఠశాలల పునఃప్రారంభంలో విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను విశ్వాసంలోకి తీసుకోవాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఫోన్లు ఉన్నా సిగ్నల్‌ అందని పరిస్థితి ఉన్నదని, ఇందుకు ప్రత్యామ్నాయ విధానాలు అవలంబించాలని పేర్కొన్నారు. ఐటీడీఏల్లో గతంలో విద్యాశాఖ నుంచి ప్రత్యేక అధికారి ఉండేవారని, ఇప్పుడు ఆ పోస్టు లేకపోవడంతో గిరిజన విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారని, తిరిగి ఆ భర్తీ చేయాలని కోరారు. సమావేశంలో అధికారులు చిత్రా రాంచంద్రన్‌, బుర్రా వెంకటేశం, రాహుల్‌బొజ్జా, క్రిస్టినా జడ్‌చోంగ్తూ తదితరులు పాల్గొన్నారు. 


logo