శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 30, 2020 , 02:08:20

రైతు వేదిక రెడీ

 రైతు వేదిక రెడీ

  • నేడు జనగామ జిల్లా కొండకండ్లలో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌
  • ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి
  • 96 శాతం వేదికల నిర్మాణం పూర్తి 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రైతులందరూ ఒక్కచోట చేరి తమ సాదకబాధకాలను చర్చించుకొనే రైతు వేదిక సిద్ధమయింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శనివారం జనగామ జిల్లా కొడకండ్లలో నిర్మించిన రైతు వేదికను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను గురువారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పరిశీలించారు. అసంఘటితంగా ఉన్న రైతులందరినీ ఒకచోట చేర్చేలా సీఎం కేసీఆర్‌ రైతువేదికల నిర్మాణానికి రూపకల్పన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 2,462, పట్టణ ప్రాంతాల్లో 139 కలిపి మొత్తం 2,601 రైతు వేదికలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.350 కోట్లు కేటాయించింది. ఒక్కోదానిని 2,046 చదరపు అడుగుల విస్తీర్ణంలో, రూ.22 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల నిర్మాణాన్ని నవంబర్‌ నాటికి పూర్తిచేసేలా ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే 2,500 వరకు (96 శాతం) నిర్మాణం పూర్తికాగా.. పదిహేను రోజుల్లో మొత్తం పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

ఈ వేదికల ద్వారా రైతులను ఏకంచేసి వారిలో చైతన్యం నింపేలా ప్రభుత్వం కృషి చేస్తున్నది. క్లస్టర్లవారీగా రైతులు కూర్చొని ఏ పంట వేయాలి.. ఎరువులు, విత్తనాలు ఎలా సేకరించుకోవాలి.. పండిన పంటలను ఎక్కడ, ఎంత ధరకు విక్రయించాలి.. మార్కెట్లో ఏ పంటలకు డిమాండ్‌ ఉన్నది తదితర అంశాలపై రైతులు కూలంకశంగా చర్చించుకునే అవకాశం ఉంటుంది. రైతులు ప్రత్యేకంగా సమావేశమయ్యేందుకు విశాలమైన గదులను నిర్మించారు. రైతులు, అధికారులు, రైతుబంధు సమితి కోఆర్డినేటర్లు ఇలా అంతా కూర్చొని చర్చించేందుకు వీలుగా 1,498 చదరపు అడుగుల్లో హాలు, అధికారుల కోసం ప్రత్యేకంగా రెండు గదులను నిర్మించారు. ప్రతి రైతువేదికకు ఫైబర్‌నెట్‌ ద్వారా ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇవ్వడం ద్వారా రైతులు వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలతో నేరుగా మాట్లాడే అవకాశం కల్పించనున్నారు. వ్యవసాయానికి సంబంధించిన ప్రతి సమాచారం రైతులకు చేరుతుంది. అన్నదాతలకు నూతన వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించే నైపుణ్య కేంద్రాలుగానూ ఇవి ఉపయోగపడునున్నాయి.

తెలంగాణకు ఐకాన్‌గా రైతు వేదికలు

జనగామ, నమస్తే తెలంగాణ:  తెలంగాణను దేశానికే తలమానికంగా తీర్చిదిద్దాలన్నది సీఎం కేసీఆర్‌ సంకల్పమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదిక ప్రారంభోత్సవ ఏర్పాట్లను గురువారం రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొడకండ్ల రైతు వేదికను ఇతర ప్రాంతాలకు ఐకాన్‌గా మారుస్తామని, ఏనుమాముల మార్కెట్‌ యార్డు మాదిరిగా తీర్చిదిద్దుతామని చెప్పారు. సీఎం కేసీఆర్‌ రైతువేదికను ప్రారంభించాక సమీపంలోని పల్లె ప్రకృతివనాన్ని సందర్శిస్తారని చెప్పారు. అనంతరం డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను ప్రారంభించి మార్కెట్‌ యార్డు ఆవరణలో ఏర్పాటు చేసే సభలో 5 వేల మంది రైతులతో ముఖాముఖి మాట్లాడుతారని తెలిపారు.