శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 31, 2020 , 14:14:40

రైతు వేదిక ఒక ఆటం బాంబు : సీఎం కేసీఆర్

రైతు వేదిక ఒక ఆటం బాంబు : సీఎం కేసీఆర్

జ‌న‌గామ : రైతు వేదిక నా గొప్ప క‌ల.. రైతాంగం ఒక‌చోట కూర్చొని మాట్లాడుకోవాలి. నియంత్రిత సాగుపై మాట్లాడిన‌ట్లే చ‌ర్చ చేయాలి. రైతు వేదిక ఒక ఆటం బాంబు, ఒక శ‌క్తి అని పేర్కొన్నారు. రైతులంద‌రూ సంఘ‌టితంగా మారాలి. రైతు వేదిక‌లు నిజ‌మైన రైతు వేదిక‌లు కావాలి. రైతులంద‌రూ వేదిక‌ల్లో కూర్చొని ఏ పంట వేయాల‌ని నిర్ణ‌యించాలి. మ‌ద్ద‌తు ధ‌ర‌ను కూడా నిర్ణ‌యించాలి అని సీఎం కేసీఆర్ అన్నారు. 

జ‌న‌గామ జిల్లా కొడ‌కండ్ల‌లో రైతు వేదిక‌ను ప్రారంభించిన అనంత‌రం అక్క‌డి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన స‌మావేశంలో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. రైతు వేదిక‌ను ప్రారంభించ‌డంతో ఈ రోజు నాకు సంతోషంగా ఉంది. మేడ్చ‌ల్‌లో కొత్త చ‌రిత్ర‌కు శ్రీకారం చుట్టాం. కొడ‌కండ్లలో మ‌రో చ‌రిత్ర‌కు శ్రీకారం చుట్టాం. భార‌త‌దేశంలో ఎక్క‌డా లేని విధంగా రైతు వేదిక‌ల‌ను తెలంగాణ‌లో ఏర్పాటు చేశాం. ప్ర‌పంచంలో కూడా రైతు వేదిక‌లు లేవు. అమెరికా, యూర‌ప్ దేశాల్లో కూడా రైతులు నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తూనే ఉంటారు. ట‌న్నుల కొద్ది ట‌మాటాలు, ఆలుగ‌డ్డ‌లు ప‌డేస్తనే ఉంటారు. రైతు పెద్ద‌వాడు అనేది విన‌డానికి బాగానే ఉంది. రైతులు కూర్చోవ‌డానికి వేదిక‌లు లేవు. ఆగ‌మాగం ఉంది. ఇత‌ర దేశాల్లో రైతుల‌కు ప్ర‌భుత్వాలు రాయితీలు ఇస్తున్నాయి. రైతుల‌కు స‌బ్సిడీలు ఇస్తామంటే కేంద్రం ఇవ్వొద్ద‌ని ఆంక్షలు పెడుతుంది. 

వ‌రి ధాన్యాన్ని రూ.1888కే కొనాలి. అంత‌కంటే ఎక్కువ పెట్టి కొంటే ధాన్య‌మే తీసుకోం అని ఎఫ్‌సీఐ ఆర్డ‌ర్ చేసింది. స‌న్న వ‌డ్ల‌కు ఎక్కువ ధ‌ర చెబుదామంటే చెప్ప‌లేని ప‌రిస్థితి. ఇది దేశంలోని రైతుల మీద ఉన్న ప్రేమ‌. ఇది ఆషామాషీ విష‌యం కాదు. ఈ విష‌యాన్ని రైతులంద‌రూ గ‌మ‌నించాలి. వీట‌న్నింటిని అధిగ‌మించేందుకు ఆలోచించాలి. కేంద్ర ప్ర‌భుత్వం క‌ళ్లు తెరిపించాలి. తాము లేనిది మీరు ఎక్క‌డ ఉన్న‌ది అని వార్నింగ్ పంపించాలి అని సీఎం కేసీఆర్ అన్నారు.