శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 17, 2020 , 13:36:19

అన్నంపెట్టే రైతు అగ్ర‌భాగాన నిల‌వాలి: నిరంజ‌న్‌రెడ్డి

అన్నంపెట్టే రైతు అగ్ర‌భాగాన నిల‌వాలి: నిరంజ‌న్‌రెడ్డి

వ‌న‌ప‌ర్తి: వ్య‌వ‌సాయం లేనిదే ప్ర‌పంచం మ‌నుగ‌డ సాగించ‌లేద‌ని మంత్రి నిరంజ‌న్ రెడ్డి అన్నారు. ఆరేండ్ల‌లో వ్య‌వ‌సాయ రంగంలో దేశానికి తెలంగాణ ఆద‌ర్శంగా నిలిచింద‌ని చెప్పారు. వ‌న‌ప‌ర్తి జిల్లాలో ప‌ర్య‌టించిన మంత్రి వ్య‌వ‌సాయ అధికారులు, వ్య‌వ‌సాయ విస్త‌ర‌ణాధికారుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. 

రైతును రాజును చేయాల‌న్న‌దే సీఎం కేసీఆర్ సంక‌ల్ప‌మ‌ని చెప్పారు. ద‌స‌రా వ‌ర‌కు రైతువేదిక‌లు సిద్ధమ‌వ్వాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. వేదిక‌ల నిర్మాణాలు త్వ‌రిత‌గ‌తిన పూర్త‌య్యేందుకు వ్య‌వ‌సాయ అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. రైతు వేదికల‌ నిర్మాణం, నిర్వ‌హ‌ణ‌లో వ్య‌వ‌సాయ శాఖ అధికారుల పాత్ర కీల‌క‌మ‌ని చెప్పారు.  

అన్నం పెట్టే రైత‌న్న‌లు అగ్ర‌భాగాన నిల‌వాల‌ని, రైతులు న‌ష్టాల బాట వీడి లాభాల బాట‌ప‌ట్టాల‌ని ఆకాంక్షించారు. రైతువేదిక‌ల ద్వారా రైతుల‌ను సంఘ‌టితం చేయాల‌న్న‌దే సీఎం కేసీఆర్ ఆలోచ‌న అని చెప్పారు. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ ఉత్ప‌త్తికి ధ‌ర నిర్ణ‌యిస్తున్నారని, రైతు మాత్రం తాను పండించిన పంట‌కు ఇత‌రులు నిర్ణయించే ధ‌ర కోసం ఎదురు చూస్తున్నాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రైతు బాగుంటేనే త‌న చుట్టూ ఉన్న వ‌ర్గాల‌న్నీ బాగుంటాయ‌ని వెల్ల‌డించారు. పంట‌లు పండితేనే ప‌ల్లెలు చ‌ల్ల‌గా ఉంటాయ‌ని చెప్పారు. 

గ‌త ఆరేండ్లుగా దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా వ్య‌వ‌సాయ, దాని అనుబంధ‌‌‌ రంగాల‌పై తెలంగాణ ప్ర‌భుత్వం ఏడాదికి దాదాపు రూ.60వేల కోట్లు ఖ‌ర్చు చేస్తున్న‌ద‌ని తెలిపారు. రైతుబంధు, రైతుబీమా ప‌థ‌కాల‌తోపాటు, వ్య‌వ‌సాయానికి 24 గంట‌ల ఉచిత క‌రెంటు అందిస్తున్నామ‌న్నారు. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా నీరు అందిస్తూ రైతుల‌కు అండ‌గా నిలుస్తున్నామ‌ని చెప్పారు. రైతు వేదిక‌ల ద్వారా వ్య‌వ‌సాయ రంగంలో నూత‌న మెళ‌కువ‌లు, కొత్త సాంకేతిక ప‌ద్ధ‌తులు, రైతుల విజ‌యగాధ‌ల‌ను అందించి స్ఫూర్తినందిస్తామ‌ని చెప్పారు.


logo