గురువారం 28 మే 2020
Telangana - May 18, 2020 , 01:26:28

తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు రైతుబీమా ఆసరా

తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు రైతుబీమా ఆసరా

బోథ్‌ : ఆ అనాథలైన పిల్లలకు రైతు బీమా ఆసరాగా నిలిచింది. చదువుల కోసం భవి ష్య నిధిగా మారనుంది. అవసరాలకు ఆదుకోనుంది. బోథ్‌ మండలంలోని అందూర్‌ గ్రామానికి చెందిన పెందూర్‌ లలిత, కొత్తపల్లె గ్రామానికి చెందిన నైతం రమేశ్‌ వివాహం 2013లో జరిగింది. లలిత కుటుంబానికి వ్యవసాయ భూమి ఉండడం, పని చేసే వారు లేకపోవడంతో రమేశ్‌ పైండ్లెన నాటి నుంచి అత్తగారింటి వద్దనే ఉన్నాడు. పదెకరాల వరకున్న భూమిలో పంటలు సాగు చేశాడు. వారికి నైతం లక్ష్మీకాంత్‌ (5), నైతం అక్షిత (3) అనే ఇద్దరు పిల్లలున్నారు. 

2019 సెప్టెంబర్‌ 12న రమేశ్‌ గుండె పోటుతో మృతిచెందాడు. అతడి పేరిట 2.20 ఎకరాల భూమి ఉండడంతో ప్రభుత్వం రైతు బీమా పథకం ద్వారా ప్రీమియం కట్టడంతో రూ 5 లక్షలు మంజూరయ్యాయి. కుటుంబీకులు, బంధువులు  వచ్చిన ఆర్థిక సహయాన్ని భవిష్యత్‌ అవసరాల కోసం బ్యాంకు లో పిల్లల పేరిట డిపాజిట్‌ చేశారు. కూతురు అక్షిత పేరిట రూ 2. లక్షలు, కుమారుడు లక్ష్మీకాంత్‌ పేరిట రూ. లక్ష, తల్లి నైతం లలిత పేరు మీద రూ లక్ష తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో డిపాజిట్‌ చేశారు. 

మిగతా రూ లక్షను కుటుంబ అవసరాల కోసం బ్యాంక్‌ అకౌంట్‌లో ఉంచారు. ప్రభుత్వం అందించిన సహాయంతో కుటుంబ పోషణకు ఢోకా లేదనుకుంటున్న సమయంలో  తల్లి నైతం లలిత గత ఫిబ్రవరి 6న ఆత్మహత్య చేసుకుంది. లలిత పేరిట రెండెకరాల భూమి ఉండడంతో మరోసారి రైతు బీమా వర్తించనుంది. త్వరలోనే మరో రూ 5 లక్షల ఆర్థిక సహాయం కుటుంబానికి అందనుంది. చిన్న తనంలో నే అమ్మానాన్నలను కోల్పోయి అనాథలైన పిల్లలకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు బీమా ఆసరాగా నిలిచింది. భవిష్యత్తులో వారి అవసరాలను తీర్చేందుకు ఉపయోగపడనుంది.  


logo