సోమవారం 01 జూన్ 2020
Telangana - May 18, 2020 , 21:44:32

రైతు బీమా ...జ్యోతి జీవితం నిలబెట్టింది

 రైతు బీమా ...జ్యోతి జీవితం నిలబెట్టింది

తిమ్మాపూర్‌రూరల్‌: అమ్మా, నాన్న.. ఇద్దరు బిడ్డలు.. పదేండ్ల కిందట హాయిగా సాగుతున్న ఆ కుటుంబానికి అనుకోని కష్టం ఎదురైంది. అనారోగ్యం కారణంగా తండ్రి మరణించడంతో పెద్దదిక్కును కోల్పోయింది. కొన్నేండ్లకు తల్లి మరణంతో అక్కాచెల్లెళ్లు ఇద్దరూ అనాథలయ్యారు. తోడుగా ఉన్న అక్కసైతం రెండేండ్ల కిందట మరణించడంతో చెల్లి జీవితం ప్రశ్నార్థకమైంది. అలాంటి యువతికి సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన రైతు బీమా ఆమె జీవితంలో వెలుగు నింపింది. వచ్చిన డబ్బులతో వివాహం చేసుకుని సంతోషంగా గడుపుతున్న తిమ్మాపూర్‌ మండలం మన్నెంపల్లికి చెందిన యువతి జ్యోతిపై ప్రత్యేక కథనం..

కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన సానకొండ రాజయ్య, రాజేశ్వరి దంపతులు తమకున్న 1.18 ఎకరాలలో వ్యవసాయం చేయడంతోపాటు టైలరింగ్‌ పనులు చేసుకునే వారు. ఈ పనులు లేనప్పుడు కూలీకి వెళ్లి ఇద్దరు కూతుళ్లు అనూష, జ్యోతిని ఉన్నంతలో బాగా చూసుకునేవారు. ఈ క్రమంలో రాజయ్య పదేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించగా, అతని భార్య రాజేశ్వరి కూడా ఐదేళ్ల కింద చనిపోయింది. ఆ తర్వాత అక్కాచెల్లెళ్లు ఇద్దరూ అష్టకష్లా పడుతూ కాలం వెల్లదీశారు. అయితే అనూష కూడా అనారోగ్యంతో 2018 నవంబర్‌ 1న మరణించడంతో జ్యోతి ఒంటరిదైంది.

 అమ్మా, నాన్న, అక్క అనారోగ్యంతో ఒక్కొక్కరుగా మరణించడంతో జ్యోతి జీవితం చీకటయింది. కొన్ని రోజులు ఒంటరిగా గడిపింది. అయితే తమకు వారసత్వంగా వచ్చిన భూమి తన అక్క అనూష పేరు మీద ఉండడంతో ఆమె మరణ వార్త తెలుసుకుని వ్యవసాయ శాఖ అధికారులు జ్యోతిని కలిసి బీమా విషయాన్ని చెప్పారు. వివరాలు నమోదు చేసుకుని నెల తిరిగే లోపు రూ.5 లక్షలు ఆమె ఖాతాలో జమ చేయించారు. అయిన వారందరినీ కోల్పోయి బతకడం ఎలాగో తెలియక ఎనకా.. ముందు ఆలోచిస్తున్న జ్యోతికి అంత పెద్ద మొత్తం రావడంతో తన జీవితానికి భరోసా లభించినట్లయింది. 2019 నవంబర్‌ 3న కరీంనగర్‌కు చెందిన లింగంపల్లి నరేశ్‌తో బంధువుల సమక్షంలో వివాహం చేసుకుని ఆనందంగా గడుపుతున్నది. రైతు బీమా ద్వారా వచ్చిన డబ్బులను ఆమె పేరుమీద బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసుకున్నది.

సార్‌ రుణం తీర్చుకోలేను- జ్యోతి

అమ్మా, నాన్న, అక్క ఇలా అందరూ దూరమవడంతో జీవితం దుర్భరమనిపించింది. చుట్టాలు ఎంతమంది ఉన్నా ఎన్ని రోజులు చూసుకుంటరు. ఎంతని సాయం చేస్తరు. మా అక్క పేరు మీద భూమి ఉన్నా పైరవీలు లేకుండా అధికారులే వచ్చి నా అకౌంట్లో రూ.5 లక్షలు జమ చేయించిన్రు.. ఇంత మంచి పథకం పెట్టిన సీఎం కేసీఆర్‌ సారు రుణం ఎన్నటికీ తీర్చుకోలేను. ఈ డబ్బులు నాకు ఎంతో భరోసానిచ్చినయ్‌. భర్తతో కలిసి ఇప్పుడు ఆనందంగా జీవిస్తున్నా. నాలాంటి ఎంతో మంది బిడ్డల జీవితాలను నిలబెడుతున్న సార్‌కు ధన్యవాదాలు.logo