బుధవారం 15 జూలై 2020
Telangana - Jun 17, 2020 , 01:38:45

వివరాలు తెలుసుకోనైనా.. రైతుబంధు అందించాలి

వివరాలు తెలుసుకోనైనా.. రైతుబంధు అందించాలి

  • ఒక్క రైతుకూ ఇబ్బంది రావొద్దు
  • నియంత్రిత సాగుకు రైతాంగం మద్దతు
  • నాలుగు నెలల్లో రైతు వేదికలు
  • నియోజకవర్గానికి వెయ్యి కల్లాలు
  • కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ రైతులు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో వెంటనే రైతులందరికీ రైతుబంధు డబ్బులు ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఏ ఒక్క రైతునూ మినహాయించకుండా అందరికీ రైతుబంధు డబ్బులు వచ్చేలా చూడాలి. ఎవరికి రాకున్నా వారి వివరాలు తీసుకొనైనా పెట్టుబడి సాయం అందేలా చూడాలని ఆదేశించారు. మంగళవారం ప్రగతిభవన్‌లో జరిగిన మంత్రులు, కలెక్టర్ల సమావేశంలో సీఎం మాట్లాడుతూ వానకాలంలో నియంత్రిత పద్ధతిలో పంట సాగుచేయాలని ప్రభుత్వం పిలుపునిస్తే రైతులు సంపూర్ణంగా పాటించారని, చెప్పిన ప్రకారం పంటలు సాగుచేస్తున్నారని చెప్పారు. 

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి, ప్రయత్నానికి రైతుల నుంచి మద్దతు లభించిందన్నారు. యాసంగిలో కూడా ఏ పంటలు వేయాలనే విషయంలో ప్రణాళిక రూపొందించి, అందుకు అనుగుణంగా సాగుచేయించాలని అధికారులకు సూచించారు. ‘తెలంగాణ దేశంలోనే అద్భుత వ్యవసాయ రాష్ట్రంగా రూపాంతరం చెందుతున్నది. ఈ సమయంలో రైతులకు మరింత చేదోడు వాదోడుగా ఉండాలి. రైతులకు అవసరమైన అవగాహన కల్పించడానికి, రైతులు పరస్పరం చర్చించుకోవడానికి వీలుగా క్లస్టర్లవారీగా రైతు వేదికలు నిర్మించాలని నిర్ణయించాం. ఈ వేదికల నిర్మాణం నాలుగు నెలల్లో పూర్తికావాలి’ అని సీఎం అన్నారు.  

నియోజకవర్గానికి వెయ్యి కల్లాలు

వ్యవసాయంలేని పట్టణ నియోజకవర్గాలను మినహాయించి, రాష్ట్రంలోని అన్ని గ్రామీణ నియోజకవర్గాల్లో మొత్తం లక్ష కల్లాలను ఈ ఏడాది నిర్మించాలని నిర్ణయించామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ‘ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి కల్లాలు కేటాయిస్తాం. రైతులకున్న భూమి, అవసరాన్ని బట్టి 50, 60, 75 చదరపు అడుగుల విస్తీర్ణాల్లో కల్లాల నిర్మాణానికి అనుమతులిస్తాం. ప్రతిఏటా  ప్రతి నియోజకవర్గానికి వెయ్యి చొప్పున కేటాయిస్తాం. ఎక్కువ మంది రైతులు ముందుకొస్తే, లాటరీ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. రూ.750 కోట్ల వ్యయం అయ్యే కల్లాల నిర్మాణానికి నరేగా నిధులు వినియోగించాలి. ఎస్సీ, ఎస్టీ రైతులకు వందశాతం సబ్సిడీతో నిర్మించాలి. మిగతా వారు 10 శాతం లబ్ధిదారుడి వాటాగా చెల్లిస్తే, 90 శాతం సబ్సిడీ ఇస్తాం’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.  

ఇరిగేషన్‌ నెట్‌వర్క్‌ మ్యాపింగ్‌

రాష్ట్రంలో సాగునీటి వ్యవస్థ మ్యాపింగ్‌ జరుగాలని సీఎం అన్నారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతున్నది. సీతారామ, పాలమూరు-రంగారెడ్డి, ఆదిలాబాద్‌ ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి సౌకర్యం పెరుగుతున్నది. దీనికి అనుగుణంగా ఇరిగేషన్‌ నెట్‌వర్క్‌ మ్యాపింగ్‌చేయాలి. జిల్లాలవారీగా నెట్‌వర్క్‌ వివరాలు కలెక్టర్ల దగ్గర ఉండాలి. రైతులు చెరువుల్లోని పూడిక మట్టిని స్వచ్ఛందంగా తీసుకుపోవడానికి అవకాశం ఇవ్వాలి. దీనివల్ల అటు పంట పొలాల్లో భూసారం పెరుగుతుంది. ఇటు చెరువుల్లో పూడిక పోతుంది. కాబట్టి రైతులను ప్రోత్సహించాలి. గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాలు కచ్చితంగా ప్రతి నెలా కరెంటు బిల్లులు చెల్లించాలి. బకాయిలు ఉంటే క్షమించే ప్రసక్తే లేదు. పట్టణాలు, గ్రామాలకు మిషన్‌ భగీరథ ద్వారానే మంచినీటి సరఫరా జరుగుతున్నందున గతంలో వాడిన మోటర్లను తొలిగించాలి. అవి అలాగే ఉండటం వల్ల అనవసరంగా కరెంటు బిల్లులు, నిర్వహణ వ్యయం భారంగా మారుతున్నది’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.   


logo