ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Aug 28, 2020 , 01:37:53

దేశ ధాన్యాగారం తెలంగాణ

దేశ ధాన్యాగారం తెలంగాణ

  • గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ప్రశంస
  • రైతుబంధు పథకం ఓ ట్రెండ్‌ సెట్టర్‌
  • వ్యవసాయ వర్సిటీ స్నాతకోత్సవంలో నాబార్డు చైర్మన్‌ గోవిందరాజులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సాగునీరు, వ్యవసాయం, వ్యవసాయాధారితరంగాల్లో అభివృద్ధి పనులతో తెలంగాణ.. భారతదేశ ధాన్యాగారంగా నిలిచిందని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ప్రశంసించారు. గురువారం వర్చువల్‌ మోడ్‌లో జరిగిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం నాలుగో స్నాతకోత్సవంలో గవర్నర్‌ తమిళిసై చాన్స్‌లర్‌ హోదాలో రాజ్‌భవన్‌ నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డిగ్రీ పట్టా పొందిన విద్యార్థులు, పరిశోధకులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇంటర్‌ డిసిప్లినరీ పరిశోధనలతో వ్యవసాయరంగ సుస్థిరతకు పాటుపడాలని పిలుపునిచ్చారు. సంప్రదాయ విజ్ఞానాన్ని, శాస్త్ర సాంకేతికత అనుసంధానంతో వ్యవసాయాన్ని పరిపుష్టం చేసి ఆహారభద్రత సాధించాలన్నారు. 

వ్యవసాయరంగం ఓ వెలుగురేఖ

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం దేశంలోనే ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిందని నాబార్డు చైర్మన్‌ గోవిందరాజులు చింతల అభివర్ణించారు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు, మిషన్‌ కాకతీయ పథకాల ద్వారా సమర్థ నీటియాజమాన్య పద్ధతులతో తెలంగాణ మంచి పనితీరు కనపరుస్తున్నదన్నారు. తెలంగాణకు అవసరమైన రిసెర్చ్‌ ప్రాజెక్టుల విషయంలో వర్సిటీకి తోడ్పాటునందిస్తామని హామీఇచ్చారు. తెలంగాణ సోనాకు బ్రాండ్‌ ఇమేజ్‌ కల్పించేందుకు ఇటీవల ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు వర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు తెలిపారు. నాబార్డు చైర్మన్‌ గోవిందరాజులుకు డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ ప్రదానంచేశారు. 12 మంది విద్యార్థులకు యూజీ లో, 10 మందికి పీజీలో గోల్డ్‌ మెడల్స్‌, 30 మంది స్కాలర్స్‌కు పీహెచ్‌డీ పట్టాలు అందజేశారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్‌ సుధీర్‌, డీన్లు, ప్రొఫెసర్లు, స్కాలర్స్‌, విద్యార్థులు పాల్గొన్నారు.


logo