శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Dec 29, 2020 , 01:49:34

తొలిరోజే 494 కోట్లు

తొలిరోజే 494 కోట్లు

  • 16.04 లక్షల మంది ఖాతాల్లో జమ
  • యాసంగి రైతుబంధు పంపిణీ ప్రారంభం
  • తొలిరోజు ఎకరం పట్టాదారుల ఖాతాల్లో జమ 
  • నేడు రెండెకరాల రైతుల ఖాతాల్లోకి సాయం 
  • మూడు రోజుల్లోనే మెజార్టీ రైతులకు పంపిణీ 
  • పది రోజుల్లో పూర్తి కానున్న పంపిణీ ప్రక్రియ 
  • రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల్లో హర్షాతిరేకాలు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: యాసంగి సీజన్‌కుగానూ రైతులకు పంటపెట్టుబడి సాయం.. రైతుబంధు పంపిణీ సోమవారం ప్రారంభమైంది. తొలిరోజు 16.04 లక్షల మంది రైతులకు రైతుబంధు అందించినట్టు వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఎకరాకు ఐదువేల చొప్పున సోమవారం సాయంత్రం వరకు రైతుల ఖాతాల్లో రూ.494.11 కోట్లు జమచేసినట్టు వెల్లడించారు. ఈ సీజన్‌లో తొలుత చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యం కల్పించారు. ఇందులోభాగంగా మొదటిరోజు ఎకరం భూమి ఉన్న పట్టాదారులకు నిధులు జమచేశారు. మంగళవారం రెండెకరాల భూమిగల పట్టాదారులకు పెట్టుబడి సాయం అందిస్తారు. వారం పదిరోజుల్లో అన్నదాతలందరికీ రైతుబంధు పంపిణీని పూర్తిచేయనున్నారు. ఈ సీజన్‌లో మొత్తం 61.49 లక్షలమంది రైతులకు రూ.7,515 కోట్లను పంపిణీచేయనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వెల్లడించిన విషయం తెలిసిందే. వీరిలో చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ ఉన్నందున మొదటి మూడురోజుల్లోనే అత్యధికులకు పెట్టుబడిసాయం అందుతుంది. మూడునుంచి ఐదెకరాలు కలిగిన రైతులు దాదాపు పదిలక్షల మంది ఉంటారు. ఈ విధంగా గరిష్ఠంగా వారంరోజుల్లో 95 శాతం మందికి రైతుబంధు చేరుతుంది. రాష్ట్రంలోని ప్రతి రైతుకు కూడా కచ్చితంగా రైతుబంధు అందాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా పకడ్బందీగా చర్యలు తీసుకొంటున్నారు. ప్రతి రైతు బ్యాంకు ఖాతాను పరిశీలించి.. సాయం జమచేస్తున్నారు. బ్యాంకు ఖాతా ల వివరాల్లో ఏమైనా తప్పులుంటే ఆ రైతుల నుంచి వివరాలు సేకరించి.. రైతుబంధు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈసారి 1.70 లక్షల మంది కొత్త రైతులకు రైతుబంధు సాయం అందించనున్నారు. వీరి వివరాలను స్థానిక ఏఈవోలు సేకరించి జాబితాను సిద్ధంచేశారు. సాగు సమయానికే రైతుబంధు నిధులు అందడంతో సన్నకారు రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. విత్తనాలు, ఎరువులు, దుక్కి దున్నేందుకు అప్పు చేయాల్సిన పరిస్థితి తప్పిందని సంతోషిస్తున్నారు. గత యాసంగితో పోల్చితే ఈ యాసంగిలో అధిక విస్తీర్ణంలో పంటలు సాగయ్యే అవకాశమున్నది.  


logo