మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 12, 2020 , 02:47:00

రైతుబంధు దక్కని రైతు ఉండొద్దు

రైతుబంధు దక్కని రైతు ఉండొద్దు

  • అందని రైతులు ఏ మూలన ఉన్నా కనిపెట్టి ఇవ్వండి
  • రైతుబంధు ఇచ్చేందుకు గడువు లేదు: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని చిట్టచివరి రైతుకు కూడా రైతుబంధు అంది తీరాల్సిందేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. రైతుబంధు అందని రైతు తెలంగాణలో ఉండకూడదనేదే ప్రభుత్వ సంకల్పమన్నారు. రైతుబంధు సాయం, ఇతర వ్యవసాయ అంశాలపై సీఎం కేసీఆర్‌ శనివారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుబంధు ఇచ్చేందుకు ఎలాంటి కాలపరిమితి లేదని ప్రకటించారు. రైతులందరికీ పెట్టుబడి అందించడానికి ఎంత ఖర్చుకైనా ప్రభుత్వం వెనుకాడబోదని తెలిపారు. చివరి రైతుకు సాయం అందేవరకు విశ్రమించొద్దని అధికారులను ఆదేశించారు. 

వందకువంద శాతం రైతులకు సాయం అందడమే ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా తనకు రైతుబంధు సాయం అందలేదని అనొద్దని సీఎం అన్నారు. రైతుబంధు అందని రైతుల వివరాలను ఏఈవోల ద్వారా తెప్పించుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో రైతులు ఎందరున్నారు? రైతుబంధు ఎంతమందికి వచ్చింది? ఎంతమందికి రాలేదు? రానివారికి ఎందుకు రాలేదు? ఈ సమస్యను పరిష్కరించి రైతుబంధు అందించడమెలా? అనే అంశాలపై వెంటనే నివేదిక సమర్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. రైతుబంధుసమితుల ద్వారా కూడా వివరాలు తెప్పించుకోవాలని సూచించారు. 

సాయం అందని రైతులు ఎవరైనా మిగిలిపోతే వారికి వెంటనే సాయం అందించాలని సూచించారు. భూముల క్రయ విక్రయాలు జరిగితే ఆ వివరాలను కూడా వెంటనే నమోదుచేయాలని సీఎం ఆదేశించారు. కరోనా కష్టకాలంలో ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేకపోయినా, రైతులకు అం డగా నిలువాలని సదుద్దేశంతో ప్రభుత్వం రైతుబంధు విడుదలచేసిందని తెలిపారు. ఇప్పటివరకు 99.9 శాతం మంది రైతులకు సాయం అందినట్టు వెల్లడించారు. మంత్రు లు వారి జిల్లాల్లో, ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గంలో రైతులకు సాయం అందిందా? ఇంకా ఎవరైనా మిగిలారా? వంటి విషయాలను వెంటనే తెలుసుకొని అందరికీ డబ్బులు అందించే ఏర్పాట్లు చేయాలన్నారు. కాస్తులో ఉన్నప్పటికీ కొందరు రైతులకు యాజమాన్యహక్కుల విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉండటం వల్ల రైతుబంధు అందటంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నదన్నారు. 

అలాంటివారిని కలెక్టర్లు గుర్తించి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. యాజమాన్యహక్కు గుర్తించడానికి మోకా మైనా (స్పాట్‌ ఎంక్వైరీ) నిర్వహించాలని ఆదేశించారు. చుట్టుపక్కన రైతులను విచారించి యాజమాన్య హక్కులు కల్పించాలన్నారు. ‘అందరి సమస్యలు పరిష్కరించి అందరికీ సాయమందించాలి. ఈ విషయంలో రైతుబంధు సమితుల స్థానిక ప్రజా ప్రతినిధుల సాయం తీసుకోవాలి. ఒకసారి పరిష్కారమైతే ఎప్పటికీ గొడవ ఉండదు. అది అన్ని తీర్ల మంచిది’ అని సీఎం స్పష్టంచేశారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా లక్ష్మాపూర్‌ గ్రామానికి అసలు రెవెన్యూ రికార్డే లేదని, ఆ జిల్లాకు చెందిన మంత్రి మల్లారెడ్డి చొరవతో సర్వే చేయించి, ఏ భూమికి ఎవరు యజమానో నిర్ధారించినట్టు సీఎం వివరించారు. మిగతా చోట్ల కూడా అదే జరగాలని సీఎం ఆకాంక్షించారు.

వివరాలు (లక్షల్లో)
పట్టాదారు వివరాలు(రూ. కోట్లలో)
నిధులు(ఎకరాలు లక్షల్లో)
విస్తీర్ణం
మొత్తం పట్టాదారులు(ఆర్‌వోఎఫ్‌ఆర్‌ కలిపి)
60.95
7,505.78
150.12
పక్కన పెట్టిన భూమి(నాలా, మృతిచెందిన రైతులు)
0.69
65.24
1.30
అర్హత గల పట్టాదారులు
60.26
7,440.54
148.81
బ్యాంకు వివరాలిచ్చిన రైతులు
57.61
7,252.15
145.04
ట్రెజరీకి అందించిన బిల్లులు
57.61
7,247.30
144.95
నిధులు జమ
57.61
7,247.30
144.95logo