శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Sep 29, 2020 , 18:02:41

నిర్దేశిత గడువులోగా పల్లె ప్రకృతి వనాలను పూర్తి చేయాలి

నిర్దేశిత గడువులోగా పల్లె ప్రకృతి వనాలను పూర్తి చేయాలి

సిద్దిపేట : సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజక వర్గ అభివృద్ధి పై ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా మరింత వేగంగా పనులు చేయాలని జిల్లా కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి నియోజకవర్గ అధికారులకు సూచించారు. భు విస్తీర్ణం , భూ ఆకారాన్ని బట్టి ప్రణాళిక బద్దంగా పల్లె ప్రకృతి వనాలను నిర్మించాలని అందుకు మీ సొంత ఆలోచనలకు పదును పెట్టాలన్నారు. అందంగా అద్భుతంగా ఉండేలా పల్లె ప్రకృతి వనాల నిర్మాణాలను చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

గజ్వేల్ పట్టణంలోని ఐవోసీ లో అడిషనల్ కలెక్టర్ మొజాంమిల్ ఖాన్, గడా అధికారి ముత్యం రెడ్డి, డీఆర్డీఏ గోపాల్, డీపీవో సురేష్ బాబు, జెడ్పీ సీఈవో శ్రవణ్, డీఎఫ్ వో శ్రీధర్, అన్ని మండలాల సంబంధిత అధికారులతో గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిపై ఆయన సమీక్షించారు. పగోడా(గజబో ), వాకింగ్ ట్రాక్స్, ఆట వస్తువులు, బెంచీలు, గ్రీన్ వాల్, పూల మొక్కలతో కూడిన పార్కులను 15 రోజుల్లో అన్ని గ్రామాల్లో నిర్మించాలని ఆయన అధికారులను ఆదేశించారు. పనుల్లో వేగం పెంచి అందంగా తీర్చిదిద్దాలన్నారు.