శనివారం 30 మే 2020
Telangana - May 22, 2020 , 00:41:29

ఇంటర్నెట్‌లో గ్రామీణ భారతం!

ఇంటర్నెట్‌లో గ్రామీణ భారతం!

  • పట్టణాలను మించి వినియోగదారులు
  • పల్లె జనాభాలో పదిశాతం దాటిన యూజర్లు
  • నెట్‌ వాడకంలో చైనా తర్వాత మనమే
  • రోజుకు సగటున 2.2 గంటలు నెట్టింట్లో
  • చిన్నారుల్లోనూ పెరుగుతున్న వాడకం
  • లాక్‌డౌన్‌ కాలంలో విపరీతంగా వినియోగం
  • ఐఏఎంఏఐ, నీల్సన్‌ సర్వేలో వెల్లడి

యూట్యూబ్‌ పలుకరింపులు.. ఫేస్‌బుక్‌ పోస్టింగ్‌లు.. టిక్‌టాక్‌లో వీడియోలు.. పబ్జీ గేమింగ్‌లు.. ట్యాక్సీ బుకింగ్‌లు.. షాపింగ్‌ సందడులు.. వర్క్‌ఫ్రం హోంలు.. ఇలా పొద్దున లేచిన దగ్గరనుంచి అంతర్జాలం లేనిది అరక్షణమైనా గడవని స్థితి. అరచేతిలో ఇమిడే మొబైల్‌ అందుబాటులోకి వచ్చాక ఇంటర్నెట్‌ వాడకం మరీ పెరిగిపోయింది. దీనికి లాక్‌డౌన్‌ తోడుకావడంతో ఆ కాలం మొత్తం నెట్టింట్లోనే గడిచింది. ప్రస్తుతం ఇంటర్నెట్‌ వాడకంలో భారత పల్లెలు.. పట్టణాలను మించిపోయాయి. గ్రామీణభారతం అంతర్జాలయంలో తేలియాడుతున్నది.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నిత్యజీవితంలో అనేక కార్యకలాపాలకు మొబైల్‌ఫోన్‌ ఆధారంగా మారింది. దానికి ఇంటర్నెట్‌ తోడుకావడంతో ప్రపంచాన్ని అరచేతిలో చుట్టేసింది. దీంతో ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే ఉన్పప్పటికీ.. భారతదేశంలో ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నది. ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఐఏఎంఏఐ), నీల్సన్‌ జరిపిన సర్వేప్రకారం.. భారత్‌లో ఇంటర్నెట్‌ వినియోగించే వారిసంఖ్య పట్టణాల్లో కంటే గ్రామాల్లోనే ఎక్కువ ఉన్నట్టు వెల్లడైంది. పట్టణాల్లో 205 మిలియన్ల నెట్‌ వినియోగదారులుంటే, గ్రామాల్లో 227 మిలియన్లు ఉన్నట్టు పేర్కొన్నది. గ్రామాల్లో పదిశాతం కంటే ఎక్కువే నెట్‌ ఉపయోగిస్తున్నట్టు తెలిపింది. ఇంటర్నెట్‌ చౌకగా అందుబాటులోకి రావటం వల్లే భారత్‌లో ఈ సంఖ్య పెరుగుతున్నట్టు పే ర్కొన్నది. 1జీబీ డాటాకు ప్రపంచవ్యాప్తంగా సగటున రూ.600 వరకు ఖర్చవుతుంటే.. భారత్‌లో రూ.18.5కే అందుబాటులో ఉంటున్నది. 

యాప్‌లకు పెరుగుతున్న క్రేజ్‌

ప్రపంచంలో ఇంటర్నెట్‌ వినియోగిస్తున్నవారు చైనాలో అత్యధికంగా 850 మిలియన్ల మంది ఉండగా.. 504 మిలియన్లతో భారత్‌ రెండోస్థానంలో ఉన్నది. సులువుగా కనెక్షన్‌ తీసుకోవటం, సేవల్లో నాణ్యత, అందుబాటు ధరల్లో డాటా వంటి అంశాలు భారత్‌లో గ్రామీణులు ఇంటర్నెట్‌పై ఎక్కువగా సమయం కేటాయించేందుకు దోహదం చేస్తున్నట్టు సర్వేలు చెప్తున్నాయి. డిసెంబర్‌ 2019 నాటికి మనదేశంలో 432 మిలియన్ల యాక్టివ్‌ ఇంటర్నెట్‌ వినియోగదారులు ఉన్నారు. యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, టిక్‌టాక్‌, ఎంఎక్స్‌ ప్లేయర్‌, గూగుల్‌ పే, అమెజాన్‌, మింత్రా, పబ్జీ, టిండర్‌, జూమ్‌, హౌజ్‌ పార్టీ తదితర యాప్‌లకు ఆదరణ లభిస్తున్నది. టిక్‌టాక్‌, పబ్జీలు ఈ ఏడాది ఫ్రిబవరితో పోల్చితే మార్చి వరకు 50-80 శాతం వృద్ధిని నమోదుచేసింది. జూమ్‌ 17 రెట్లు, హౌజ్‌పార్టీ యాప్‌ 16 రెట్లు డౌన్‌లోడ్ల సంఖ్య పెరిగినట్టు అమెరికాకు చెందిన ఓ సర్వేలో వెల్లడైంది

నెట్‌లోకంలో చిన్నారులు

భారత్‌లో ఇంటర్నెట్‌ వినియోగించడంలో చిన్నారులు సైతం ముందువరుసలో ఉన్నా రు. 5-11 ఏండ్ల వయస్సు గల 71 మిలియన్ల మంది చిన్నారులు కుటుంబసభ్యుల ఫోన్లద్వారా నెట్‌లోకం లో విహరిస్తున్నారు. 20-29 ఏండ్ల మధ్య అత్యధికంగా 34శాతం నెట్‌ను వాడుతుండగా.. 30-39 ఏండ్ల మధ్య 20 శాతం, 40-49 ఏండ్ల మధ్య 9 శాతం, 50 ఏండ్లకు పైబడినవారు 6శాతం వినియోగిస్తున్నట్టు సర్వే ల్లో తేలింది. ఇక పురుషుల కంటే మహిళలు తక్కువగా నెట్‌ వాడుతున్నా.. ఇటీవల వారిసంఖ్య వేగంగా పెరుగుతున్నట్టు వెల్లడైంది. ఆరునెలల్లో 26 మిలియన్ల మంది మహిళలు కొత్తగా నెట్‌ యూజర్లుగా మారినట్టు తేలింది. భారత వినియోగదారులు ఎక్కువగా 4జీ సేవలను వినియోగించుకునేందుకు ఇష్టపడుతున్నారు. లాక్‌డౌన్‌లో ఇది రెండింతలు అయినట్టు తె లుస్తున్నది. రోజూ సగటున 2.2 గంటలు నెట్‌ను వినియోగిస్తున్నట్టు ఎరిక్సన్‌ కన్జూమర్‌ ల్యాబ్‌ వెల్లడించింది. లాక్‌డౌన్‌ వల్ల నెట్‌వినియోగం పెరిగిందని, ప్రపంచవ్యాప్తంగా సగటున ఒకగంట పెరిగితే భారత్‌లో ఇది మరింత పెరిగిందన్నారు.logo