బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 09, 2020 , 20:08:30

‘డిసెంబర్‌లోగా పల్లె ప్రగతి పనులు పూర్తి చేయాలి’

‘డిసెంబర్‌లోగా పల్లె ప్రగతి పనులు పూర్తి చేయాలి’

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ప‌ల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులను  వ‌చ్చే డిసెంబర్‌లోగా పూర్తి చేయాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు అధికారుల‌ను ఆదేశించారు. అన్ని జిల్లాల అదనపు క‌లెక్టర్లు, జడ్పీ సీఈఓలు, డీపీఓలతో రంగారెడ్డి జిల్లా పరిషత్‌లోని పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాల‌యం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప‌ల్లె ప్రగతి కార్యక్రమం అమలుతో గ్రామాలు కొత్తరూపు సంతరించుకున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ రూపొందించి పథకాలు దేశానికే ఆద‌ర్శంగా నిలుస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.

ప‌ల్లె ప్రగ‌తి కార్యక్రమంలో చేప‌ట్టిన ప్రకృతి వ‌నాల పెంపు, డంపు యార్డులు, వైకుంఠ ధామాలు, క‌ల్లాలు, రైతు వేదిక‌ల నిర్మాణం, హ‌రిత హారం మొక్కల పెంప‌కం స‌జావుగా అమ‌లు చేయాలని ఆదేశించారు. రైతువేదిక‌లు సాధ్యమైనంత వేగంగా పూర్తికావాల‌న్నారు. ప‌ల్లె ప్రకృతి వ‌నాలు, డంపు యార్డుల‌ను పూర్తి  చేసి, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులతో ప్రారంభించాల‌న్నారు. హ‌రిత హారంలో భాగంగా నాటిన మొక్కల‌న్నీంటిని  సంరక్షించాలని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధుల‌ను స‌మ‌న్వయం స్థానిక స‌మ‌స్యులను ప‌రిష్కరించుకోవాల‌ని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా, క‌మిష‌న‌ర్ ర‌ఘునంద‌న్ రావు, ఆయా శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

రెండు మొబైల్‌ యాప్‌లను ప్రారంభించిన మంత్రి 

పంచాయతీ రాజ్‌ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన రెండు మొబైల్‌ యాప్‌లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోమవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. పల్లె ప్రగతి – పీఎస్ యాప్ (పంచాయ‌తీ సెక్రట‌రీ యాప్),  పల్లె ప్రగతి – పర్యవేక్షణ యాప్ (ఇన్స్‌ఫెక్షన్‌ అధికారి యాప్) ల‌ను ప్రారంభించారు.  ఈ యాప్‌ల ద్వారా పంచాయతీ కార్యద‌ర్శి స్థాయి, ఎంపీఓ, డీఎల్‌పీఓ, డీపీఓ, సీఈఓల వ‌ర‌కు చేయాల్సిన ప‌నులను సూచించడంతోపాటు ఆయా ప‌నుల‌ను ఉన్నతాధికారులు ప‌ర్యవేక్షించనున్నారని ఆయన తెలిపారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.