గురువారం 04 జూన్ 2020
Telangana - Feb 11, 2020 , 02:31:24

కార్గో సేవలపై ఆర్టీసీ కసరత్తు

కార్గో సేవలపై ఆర్టీసీ కసరత్తు
  • పౌరసరఫరాలశాఖతో చర్చలు
  • సాధ్యాసాధ్యాలపై ప్రాథమికంగా అధ్యయనం
  • రవాణా కోసం ఏటా రూ.300 కోట్లు ఖర్చుచేస్తున్న పౌరసరఫరాలశాఖ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వివిధ ప్రభుత్వ శాఖలకు  సరుకు రవాణా (కార్గో) సేవలను అందించడానికి తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ముమ్మర కసరత్తు చేస్తున్నది. కార్గో సేవల కోసం ఇప్పటికే  దాదాపు 50 బస్సులను సిద్ధంచేసిన అధికారులు.. వీటి సంఖ్యను 800కు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధంచేస్తున్నారు. కార్గో సేవల విజయవంతానికి వివిధ ప్రభుత్వశాఖలను భాగస్వాములను చేయాలని నిర్ణయించిన అధికారులు.. ఇప్పటికే పౌరసరఫరాలశాఖతో సంప్రదింపులు జరిపి, ప్రాథమిక అంశాలపై చర్చించినట్టు తెలుస్తున్నది. పౌరసరఫరాలశాఖ సరుకు రవాణా కోసం ఏటా దాదాపు రూ.300 కోట్లు ఖర్చుచేస్తున్నట్టు సమాచారం.


రేషన్‌ దుకాణాలకు, సంక్షేమ హాస్టళ్లకు బియ్యాన్ని సరఫరాచేసేందుకు 600 నుంచి 700 లారీలను ఉపయోగిస్తున్నారు. 170 నుంచి 200 మంది కాంట్రాక్టర్లు ఈ ప్రక్రియను పూర్తిచేస్తున్నారు. ఇందులో అవినీతి జరుగకుండా ఇప్పటికే పౌరసరఫరాలశాఖ జీపీఎస్‌ ద్వారా నిత్యం సమీక్షిస్తున్నది. పౌరసరఫరాలశాఖ సహకారాన్ని అందిపుచ్చుకొంటే.. ఆదాయం సమకూరుతుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. దీంతోపాటు ఎరువులు, విత్తనాల సరఫరా కోసం వ్యవసాయశాఖ కూడా పెద్ద మొత్తంలో రవాణాఖర్చులు చెల్లిస్తున్నట్టు ఆర్టీసీ అధికారులు గుర్తించారు. విద్య, వైద్యం, బేవరేజస్‌ తదితర శాఖల్లోనూ రవాణా కోసం ఖర్చుచేయాల్సి వస్తున్నది. ఈ అవకాశాలన్నింటిని అందిపుచ్చుకొంటే ఆర్టీసీ ఆదాయానికి ఎలాంటి ఢోకా ఉండదని ఆ సంస్థ అధికారులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా త్వరలో ఆర్టీసీలో కార్గో సేవలు ప్రారంభమవుతాయని ఓ ఉన్నతాధికారి తెలిపారు.


logo