ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 18, 2020 , 02:36:13

అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై కసరత్తు

అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై కసరత్తు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కొవిడ్‌-19 నేపథ్యంలో నిలిచిపోయిన అంతర్రాష్ట్ర సర్వీసులను పునరుద్ధరించేందుకు ఆర్టీసీ కసరత్తు ముమ్మరం చేస్తున్నది. ఇప్పటికే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల రోడ్డు రవాణాశాఖలకు లేఖలు రాసింది. కర్ణాటకలో ప్రధానంగా బెంగుళూరు, రాయిచూరుకు తెలంగాణ నుంచి ఎక్కువ బస్సు సర్వీసులు నడుస్తాయి. కర్ణాటకకు సంబంధించి సాంకేతిక ఇబ్బందులు లేవు. అక్కడి రోడ్డు రవాణాశాఖ నుంచి సుముఖత వ్యక్తంకాగానే బస్సులు పునరుద్ధరిస్తారు. ఏపీతో కొన్ని సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నందున వాటిపై స్పష్టత కోసం అధికారులు వేచి చూస్తున్నారు. మొన్నటి వరకు ఏపీ బస్సులు మన రాష్ట్రంలో 900కిలో మీటర్ల మేర నడుస్తుండగా తెలంగాణ సర్వీసులు 700 కిలోమీటర్లే తిరుగుతున్నాయి. వ్యత్యాసం లేకుండా రెండువైపులా సమానంగా బస్సు సర్వీసులు నడుపాలని, దీనిపై ఒప్పందం తర్వాతే సర్వీసులను పునరుద్ధరించాలని సీఎం కేసీఆర్‌ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలో ఎంత మేర సర్వీసులు పెంచాలి? చర్చలు మంత్రుల స్థాయిలోనా? ముఖ్యకార్యదర్శులతో జరుపాఆ అనే అంశంలో ప్రభుత్వ అనుమతి కోసం అధికారులు వేచి చూస్తున్నట్టు సమాచారం. 


logo