బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 01, 2020 , 07:50:19

ఎలక్ట్రిక్‌ బస్సులకు.. ఆర్టీసీ డ్రైవర్లు

ఎలక్ట్రిక్‌ బస్సులకు.. ఆర్టీసీ డ్రైవర్లు

హైదరాబాద్  : నగరంలో ప్రవేశపెట్టిన బ్యాటరీ ఆపరేటెడ్‌ ఎలక్ట్రిక్‌ బస్సులు నడిపించడానికి ఆర్టీసీ డ్రైవర్లను నియమించనున్నారు. ప్రస్తుతం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు నడుస్తున్న బస్సుల ఆపరేటింగ్‌ బాధ్యతను ప్రైవేటు డ్రైవర్ల  నుంచి ఆర్టీసీ డ్రైవర్లకు అప్పగించనున్నారు. ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సులను తీసివేసిన నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 4,000 మందికి పైగా ఆర్టీసీ ఉద్యోగులు ఖాళీ ఏర్పడ్డారు. కండక్టర్లను వివిధ జిల్లాలు, డిపోల్లో సర్దినప్పటికీ డ్రైవర్లను సర్దుబాటు చేయలేకపోయారు. దీంతో మిగిలిన వారిని ట్రాఫిక్‌ కంట్రోలర్స్‌గా, తనిఖీలకు ఉపయోగించుకుంటున్నారు. కొంతమందిని ఇతర డిపార్ట్‌మెంట్లకు బదిలీ చేశారు. మరికొంతమందిని కార్గో సేవలకు ఎంపిక చేశారు. అయినప్పటికీ చాలా మందిని ఖాళీగా ఉంచుతూ జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి నెలా ఈ భారం గ్రేటర్‌ ఆర్టీసీకీ తడిసి మోపడవుతున్నది. సుమారు రూ.14 కోట్ల వరకు జీతాల భారం పడుతున్నది. 

ఈ నేపథ్యంలో వివిధ మార్గాలను అన్వేషిస్తున్నది. అందులోభాగంగానే ఎలక్ట్రిక్‌ బస్సులను నడుపుతున్న డ్రైవర్ల స్థానంలో ఆర్టీసీ డ్రైవర్లను నియమించాలని ప్రతిపాదించారు. దీనికోసం ఆపరేటర్లతో ఇప్పటికే ఆర్టీసీ అధికారులు చర్చలు జరిపారు.  అంతేగాకుండా ప్రైవేటు డ్రైవర్లకు చెల్లించే జీతం భారం ఆపరేటర్ల మీద ఉండదని వివరించగా ఆపరేటర్లు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి రెండు కారణాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో కొంతమంది డ్రైవర్లు టికెట్ల విషయంలో చేతివాటం ప్రదర్శిస్తున్నారని, తనిఖీల్లో పట్టుబడగా ఉద్యోగాల్లో నుంచి తీసివేయడం జరిగిందన్నారు. ఇటువంటి పునరావృతం అవుతుండటంతో ఆర్టీసీ డ్రైవర్లు ఇటువంటి చేతివాటం ప్రదర్శించరని ఆర్టీసీ డ్రైవర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. అంతేకాకుండా సర్‌ప్లస్‌గా ఉన్న డ్రైవర్లకు కూడా పనికల్పించినట్లు అవుతుందని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వివరించారు. 


logo