ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటం

- వరదసాయం కింద ఇప్పటికే రూ.656 కోట్లు ఇచ్చాం
- ఎన్నికల తర్వాత అన్నిఇండ్లకు ఇస్తాం: సీఎం కేసీఆర్ హామీ
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వరదల వల్ల హైదరాబాద్‌లో ఇబ్బందిపడిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు భరోసానిచ్చారు. ఒక్కో కుటుంబానికి రూ.10వేల చొప్పున ఇప్పటికే 6.56 లక్షల కుటుంబాలకు రూ.656 కోట్లు సాయం చేశామని వెల్లడించారు. కొందరి కుట్రలవల్ల సాయం పంపిణీ నిలిచిపోయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల తర్వాత మిగతా కుటుంబాలను సైతం ఆదుకుంటామని స్పష్టంచేశారు. ‘వందకు వంద శాతం నిరుపేదలను ఆదుకుంటం. ఇంకో రూ.200 కోట్లుగానీ.. రూ.300 కోట్లుగానీ ఇస్తం. ముఖ్యమంత్రిగా నేను హామీ ఇస్తున్నా’ అని భరోసా ఇచ్చారు. సోమవారం తెలంగాణభవన్‌లో సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీ టీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదలచేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
నేనే సుమోటోగా తీసుకున్నా
వరదలు మన ఒక్క దగ్గరే రాలే. ముంబైలో, చెన్నైలో, ఢిల్లీలో, అహ్మదాబాద్‌లో.. ఇలా అంతటా వచ్చినయి. ఎక్కడా ఏ ప్రభుత్వం కూడా ఇంటికి రూ.10వేలు ఇచ్చి ఆదుకోలే. పేదల కష్టాలను కండ్లారా చూసిన. మంత్రులు తలసాని, కేటీఆర్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి మోకాళ్లలోతు వరదలో తిరుగుతుంటే నేను ఇంట్లో ఉండి చూసిన. మంచం ఎత్తు నీళ్లు వచ్చినయి. సర్టిఫికెట్లు పాడైపోయినయని, బియ్యం తడిసిపోయినయని బాధితులు చెప్పిన్రు. బతుకమ్మ, దసరా పండుగ ముందు ఇట్లా అయిందని బాధపడ్డా. నన్ను ఎవరూ అడగలే.. ఎవరూ డిమాండ్ చెయ్యలే.. దరఖాస్తు చెయ్య లే.. నాకే మనసు బాధయి.. నాకు నేనే సుమోటోగా తీసుకున్న. ‘తెలంగాణల బతుకమ్మ, దసరా సెంటిమెంట్ పండుగ. ఈ సమయంలో వాళ్లు ఏం కొనుక్కొని తినడానికి లేకుండా అయింది. కాబట్టి మీరు వేరే కార్యక్రమం అపయినా సరే వారిని ఆదుకోవాల’ని సీఎస్‌ను, ఫైనాన్స్ సెక్రటరీని పిలిచి చెప్పిన.
పూర్తి పారదర్శకంగా పంపిణీ
ఇప్పటివరకు రూ.656 కోట్లతో 6.56 లక్షల కుటుంబాలకు సాయం అందించినం. డబ్బు ఎవరికి ముట్టిందో వాళ్ల ఫోన్ నంబర్లు, ఆధార్ కార్డులు, ఫొటోలు మా దగ్గర ఉన్నాయి. తర్వాత నోటిఫికేషన్ వచ్చింది. వరద సాయం కొనసాగుతున్న కార్యక్రమం.. బ్యాన్ చేయొద్దని కోరితే ముందుదశలో ఒప్పుకొన్నరు. అధికారులు పోయి పంచొద్దు.. ‘డైరెక్ట్ బెనిఫియరీ ట్రాన్స్ఫర్' (డీబీటీ) చేయమని చెప్పిన్రు. అందుకే మీసేవలో అప్లికేషన్లు పెట్టుకోమన్నం. రెండులక్షలకుపైగా అప్లికేషన్లకు ఇచ్చినం. ఇంకా వస్తా ఉండే. అంతలోనే కొంతమంది కంప్లయింట్లు ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ వారు ఒత్తిడికి లోనయ్యి ఇమీడియట్గా బ్యాన్ చేయమన్నరు. మేం ఆపేసినం. ఎవరైతే నిరుపేదలు, అర్హులు ఉన్నరో.. మహా అయితే ఇంకా లక్ష, రెండు లక్షలు ఉండొచ్చు. ఇంత ఇచ్చినవాళ్లం ఇంకో 100-200 కోట్లకు వెనక్కిపోం. కేసీఆర్‌ను.. చీఫ్ మినిస్టర్‌గా హామీ ఇస్తున్నా.. ఎన్నికల తర్వాత వందకు వందశాతం బాధితులు అందరికీ రూ.10వేలు చొప్పున ఇస్త. అప్పుడు ఎన్నికల గ్రహణం పోతది కాబట్టి బాజాప్త సిటీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కొత్త మేయర్, కార్పొరేటర్లు ఆయా కాలనీలు తిరిగి, అర్హులను గుర్తించి, వారి వివరాలు తీసుకొని ట్రాన్స్పరెంట్గా పంపిణీ చేస్తరు. బ్యాన్ వల్ల ఆగిపోయింది కానీ మాకు వేరే ఉద్దేశం లేదు.
వరద బారినుంచి హైదరాబాద్‌ను కాపాడుతం
ఒక్క హైదరాబాదే కాదు.. దేశంలోని ఆరు ప్రధాన మహానగరాలు ఢిల్లీ, చెన్నై, ముంబై, బెంగళూరు, కోల్‌కతాతోపాటు అహ్మదాబాద్ వంటి టూటైర్ సిటీలు వరదలతో అల్లాడుతున్నాయి. కొన్ని నగరాలు రెండువారాలు కూడా వరదలోనే చిక్కుకున్నాయి. ఈ విషయంపై ప్రధాని మోదీకి, అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రికి లేఖరాసి చెప్పిన. వీటి అభివృద్ధిని కార్పొరేషన్లకే వదిలేయకుండా ఆయా రాష్ర్టాల ముఖ్యమంత్రులు అధ్యక్షులుగా ప్రత్యేక కౌన్సిళ్లు పెట్టాలని ప్రధానికి సూచించిన. కేంద్రం ఏటా రూ.6వేల కోట్లు బడ్జెట్ పెడితే, రాష్ర్టాలు రూ.6 వేల కోట్లు ఇస్తమని చెప్పిన. రూ.12వేల కోట్లు ఉంటే నాలాల ఆక్రమణలు తొలిగించి, నీళ్లు సాఫీగా పోయేలా చేయొచ్చని చెప్పిన. కేంద్రం పెడచెవిన పెట్టింది. కాబట్టి మేమే వరదనీటి నిర్వహణను మ్యానిఫెస్టోలో పొందుపరిచినం. వరద బారి నుంచి హైదరాబాద్‌ను కాపాడుతం.
తాజావార్తలు
- ఊపిరితిత్తుల ఆరోగ్యానికి 7 చిట్కాలు
- పల్లెల సమగ్రాభివృద్ధి ప్రభుత్వ ఎజెండా
- ముందస్తు బెయిల్ కోసం భార్గవ్‌రామ్ పిటిషన్
- పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి
- పవన్-రామ్ చరణ్ మల్టీస్టారర్..దర్శకుడు ఎవరో తెలుసా..?
- ప్రజా సమస్యల పరిష్కారానికి పల్లెనిద్ర: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- విపణిలోకి స్పోర్టీ హోండా గ్రాజియా.. రూ.82,564 ఓన్లీ
- వెటర్నరీ వర్సిటీ వీసీగా రవీందర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ
- పది నిమిషాల్లోనే పాన్ కార్డు పొందండిలా..!
- ఎన్టీఆర్‌కు, చంద్రబాబుకు అసలు పోలిక ఉందా?: కొడాలి నాని