మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 09, 2020 , 19:53:51

50 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం

50 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం

హైదరాబాద్‌: రైతులను మోసం చేసేందుకు నకిలీ పత్తి విత్తనాలను బ్రాండెడ్‌ ప్యాకింగ్‌ కవర్‌లో నింపి విక్రియిస్తున్న ముఠాను రాచకొండ ఎస్‌ఓటీ, హయత్‌నగర్‌ పోలీసులు పట్టుకొన్నారు. వీరి నుంచి 50 లక్షల విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నేరేడ్‌మెట్‌ పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ వివరాలను వెల్లడించారు. నకిలీ విత్తనాల తయారీ సమాచారాన్ని రాచకొండ పోలీసు వాట్సప్‌ నంబరు 9490617111 లేదా డయల్‌ 100కు అందించాలని మహేష్‌ భగవత్‌ కోరారు. నకిలీ విత్తనాలపై పీడీ యాక్ట్‌ ప్రయోగిస్తామని, రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోనే నకిలీ విత్తనాల తయారీదారులపై రాష్ట్రంలోనే మొదటి సారిగా పీడీ యాక్ట్‌ను విధించామని తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు జిల్లాకు చెందిన చింతల వెంకటశ్వర్లు పదేండ్ల కిందట హైదరాబాద్‌కు వలస వచ్చి కేబుల్‌ అపరేటర్‌గా పనిచేస్తున్నాడు. వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో నంద్యాలకు చెందిన పాత్తావత్‌ కృష్ణ నాయక్‌, పుట్ట వెంకటరమణతో కలిసి నకిలీ విత్తనాల తయారీకి పథకాన్ని రూపొందించారు. హయత్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో స్థానికుడైన నోముల వెంకన్న సాయంతో గోదాంను ఏర్పాటుచేసుకొన్నారు. వెంకటరమణ, కృష్ణ నాయక్‌లు నాసిరకం విత్తనాలను తీసుకువచ్చి వాటికి ఎరుపు రంగుతోపాటు ఇతర రసాయనాలను కలిపి అసలు విత్తనాలుగా తలపించేలా తయారు చేసేవారు. వాటిని బిల్లా, పావని, సర్పంచ్‌ గోల్డ్‌ లేబులింగ్‌తో ఉన్న ప్యాకెట్లలో ప్యాకింగ్‌ చేసి 450 గ్రాముల ధర రూ.500 కు అమ్మడం ప్రారంభించారు. 

నకిలీ పత్తి విత్తనాలను విక్రయించేందుకు అశోక్‌ అనే వ్యక్తిని మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా నియమించుకొని హైదరాబాద్‌ శివారు ప్రాంతాలతోపాటు షాద్‌నగర్‌లో కూడా విక్రయించారు. నకిలీ విత్తనాల ప్యాకింగ్‌ చూసిన రైతులు బ్రాండెడ్‌ కంపెనీలకు చెందినవే అని కొనుగోలు చేసి మోసపోయిన సందర్భాలు ఉన్నట్లు విచారణలో తేలింది. ఈ నకిలీ విత్తనాల తయారీకి సంబంధించిన సమాచారం అందుకొన్న ఎస్‌ఓటీ ఎల్బీనగర్‌ ఇన్స్‌పెక్టర్‌ రవికుమార్‌, హాయత్‌నగర్‌ ఇన్స్‌పెక్టర్‌ సురేందర్‌ నేతృత్వంలోని బృందాలు బ్రాహ్మణపల్లిలోని గోదాంపై దాడులు జరిపి మొత్తం నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 10 రోజుల్లో ఇది రెండో సోదా కావడం విశేషం. అంతకుముందు రూ.22 లక్షలు విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు. 


logo