మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 09, 2020 , 02:49:49

ఇండ్ల బడ్జెట్‌ పదింతలు

ఇండ్ల బడ్జెట్‌ పదింతలు
  • రూ.11,917 కోట్లు కేటాయింపు
  • సాకారమవుతున్న పేదల సొంతింటి కల
  • నిర్మాణంలో ఉన్న ఇండ్లన్నీ త్వరలోనే పూర్తి
  • లక్షమందికి సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి సాయం
  • ఇప్పటివరకు లబ్ధిదారులకు అందిన 38,740 ఇండ్లు
  • ఇప్పటివరకు చేసిన ఖర్చు రూ.7,394.54 కోట్లు
  • ఈసారి బడ్జెట్‌లో కేటాయింపులు రూ.11,917 కోట్లు
  • 95% నిర్మాణాలు పూర్తయినవి 1,09,725
  • మొత్తం మంజూరు చేసిన ఇండ్లు: 2,83,401

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి ఈసారి బడ్జెట్‌లో అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. నిలువ నీడలేని నిరుపేదలకు సొంతింటి కలను సాకారంచేసేందుకు నిధులను ఎవరూ ఊహించని విధంగా గణనీయంగా కేటాయించింది. గత బడ్జెట్‌లో రూ.1,277 కోట్లు కేటాయించగా, ఈసారి పదింతలు పెంచి ఏకంగా రూ.11,917 కోట్లు ప్రకటించింది. పథకం ప్రారంభంనుంచి ఇప్పటివరకు రూ.7,394.54 కోట్లు డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి ఖర్చుచేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇండ్లతోపాటు సొంత స్థలం ఉండి ఇంటిని నిర్మించుకోవాలనుకొనేవారికి కూడా ఆర్థికసాయం చేయనున్నది. ప్రస్తుతం నిర్మాణాలు చివరిదశకు చేరిన 1.09 లక్షల ఇండ్లతోపాటు వివిధదశల్లో ఉన్న లక్షన్నర ఇండ్లను కూడా త్వరలోనే పూర్తిచేసి నిరుపేదలకు అందజేయనున్నది. 


టెండర్లు ఖరారుచేసి నిర్మాణాలు మొదలుపెట్టినవాటితోపాటు నిర్మించ సంకల్పించినవాటిని సైతం పూర్తిచేసేలా నిధులు కేటాయించింది. దీంతో తొలిదశలో నిర్మిస్తున్న 2.83 లక్షల డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు వచ్చే సంవత్సరంలో పూర్తిచేయనున్నట్టు బడ్జెట్‌లో పేర్కొన్నది. రాష్ట్ర ప్రభుత్వం తొలి విడుతగా రూ.18,663 కోట్లతో ఈ బృహత్తర ప్రాజెక్టును చేపట్టింది. మొత్తం 2,83,401 ఇండ్లు నిర్మించాలని పరిపాలనా అనుమతులు జారీచేసి, 2,72,763 ఇండ్ల నిర్మాణాలను మొదలుపెట్టింది. ఇప్పటికిప్పుడు పంపిణీ చేసేందుకు 95శాతం పనులు పూర్తిచేసుకున్న 1.09 లక్షల ఇండ్లు సిద్ధంగా ఉన్నాయి. మరో 32 వేల ఇండ్ల నిర్మాణాలు 80శాతం పూర్తవగా, మిగతా ఇండ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటివరకు 38,740 ఇండ్లను లబ్ధిదారులకు అందజేసింది. ఒక్కో ఇంటికి రూ.6.29 లక్షలు వెచ్చిస్తుండగా, వీటిలో రూ.5.04 లక్షలు ఇంటి నిర్మాణానికి, రూ.1.25 లక్షలు మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చుచేస్తున్నది.


లక్ష మందికి ఆర్థికసాయం

ఎన్నికల మ్యానిఫెస్టోలో టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీని 

నెరవేర్చుకొంటున్నది. సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం ఆర్థికసాయం చేయనున్నది. తొలిదశలో లక్ష మందికి ఈ సాయం అందించనున్నది. దీంతో సొంతింటి కల నెరవేరనున్నది.


బడ్జెట్‌లో అన్నిరంగాలకు ప్రాధాన్యమివ్వడం హర్షణీయం. గత బడ్జెట్‌ కంటే ఈసారి 25 శాతం పెంచారు. అక్షరాస్యత పెంపుకోసం రూ.100కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు కేటాయించడం శుభపరిణామం. 

- కొప్పుల అంజిరెడ్డి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అర్థశాస్త్రం, ఎంజీయూ, నల్లగొండ  


తెలంగాణలోని దేవాలయాలకు పునర్వైభవం తేవడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నది. యాదాద్రి క్షేత్రాన్ని ప్రభుత్వం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నది. వివిధ దేవాలయాల పూజారులకు అర్చక నిధి ద్వారా క్రమం తప్పకుండా వేతనాలు చెల్లిస్తున్నది.

- బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు


logo
>>>>>>