నేను భర్తనుంచి విడిపోయాను. ఒక కొడుకు ఉన్నాడు. మా ఆయనతో విడిపోయాక బాబును తీసుకుని, పుట్టింటికి వెళ్లిపోయాను. మా నాన్న ఈమధ్యే చనిపోయారు. దాంతో ఇంట్లో అమ్మ, అన్నయ్యతోపాటు నేను, నా కొడుకు ఉంటున్నాం. ఇప్పుడు ఉన్నట్టుండి అమ్మ, అన్నయ్య నన్ను ఇంట్లోంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మేము ఎక్కడికి వెళ్లాలో అర్థం కావట్లేదు. ఈ పరిస్థితిలో నేనేం చేయాలి?
పుట్టింట్లో ఉండేందుకు అన్ని విధాలుగా మీకు హక్కులున్నాయి. మిమ్మల్ని ఇంట్లోంచి వెళ్లగొట్టేందుకు ఎవరికీ అధికారం లేదు. ఒకవేళ మీ నాన్నగారు చనిపోయే ముందు వీలునామా రాసి ఉంటే, ఆ ప్రకారమే నామినీలకు ఇల్లు, ఆస్తులు దక్కుతాయి. హిందూ వారసత్వ చట్టం ప్రకారం, తల్లిదండ్రుల ఆస్తుల్లో కొడుకుతో సమానంగా కూతుళ్లకూ వాటాలు ఉంటాయి. మీ నాన్నగారు వీలునామా రాయకపోతే, మీ తండ్రి సంపాదించిన ఇంటిపై మీకూ హక్కు ఉంటుంది. మీ అమ్మ, అన్నయ్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని వెళ్లగొట్టలేరు. ఈ విషయంలో మిమ్మల్ని అమ్మ, అన్నయ్యలు వేధిస్తున్నట్టయితే ‘మెంటల్ డొమెస్టిక్ వయెలెన్స్’ కిందకు వస్తుంది. కాబట్టి, ఈ పాయింట్మీద మీరు పోలీస్ కంప్లెయింట్ ఫైల్ చేయవచ్చు.
మానసి చౌదరి
అడ్వకేట్
www.pinklegal.in