శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 06, 2020 , 02:12:47

జూపార్క్‌లో పెద్దపులి కదంబ మృతి

జూపార్క్‌లో పెద్దపులి కదంబ మృతి

చార్మినార్‌: హైదరాబాద్‌లోని నెహ్రూ జులాజికల్‌ పార్క్‌లో ‘కదంబ’ అనే 11 ఏండ్ల పెద్దపులి అనారోగ్యంతో మృతిచెందింది. రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ జాతికి చెందిన ఈ పులిని 2011లో జంతుమార్పిడి విధానంలో కర్ణాటక జూ నుంచి తీసుకొచ్చారు. జూపార్క్‌లో ఎక్కువ సంఖ్యలో పులులున్నప్పటికీ ఇన్‌బ్రీడింగ్‌ను నివారించడానికి పులుల మార్పిడి చేశారు. ఆ పులికి కర్ణాటక అధికారులు కదంబ అని పేరుపెట్టారు. కొన్ని రోజులుగా కదంబ అస్వస్థతకు గురై ఆహారం సరిగ్గా తినకపోవడంతో వైద్యులు పరిశీలనలో ఉంచారు. రక్షించడానికి అన్నిరకాల ప్రయత్నాలుచేసినా శనివారం మరణించినట్టు అధికారులు ప్రకటించారు.

 గుండె సంబంధ వ్యాధితో కదంబ మృతిచెందినట్టు శవపరీక్షలో తేలిందని జూ క్యూరేటర్‌ ఎన్‌ క్షతిజ తెలిపారు. ప్రస్తుతం జూపార్క్‌లో 20 వరకు పెద్దపులులు ఉన్నాయి. అందులో మూడు కూనలు, తొమ్మిది తెల్లపులులున్నాయి. కాగా మరో మూడు పెద్దపులులు అపర్ణ, సోని, రోజా సగటు జీవిత కాలం మించి జీవిస్తున్నాయి. సాధారణంగా పెద్దపులులు అడవుల్లో 14 ఏండ్ల వరకు జీవిస్తాయి. జూపార్క్‌ల వంటి క్యాప్టివ్‌ కండిషన్‌లో 16 నుంచి 19 ఏండ్ల వరకు జీవిస్తాయి. కానీ, ప్రస్తుతం మూడు ఆడ పులుల్లో రోజా వయస్సు ఇప్పటికే 21 ఏండ్లు దాటింది. సోని 20, అపర్ణ 19 ఏండ్ల వయస్సుతో ఇంకా చలాకీగా ఉన్నాయని జూ క్యూరేటర్‌ వెల్లడించారు.


logo