శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 05, 2020 , 21:21:44

హైద‌రాబాద్ జూపార్క్‌లోని బెంగాల్ టైగ‌ర్ క‌దంబ మృతి

హైద‌రాబాద్ జూపార్క్‌లోని బెంగాల్ టైగ‌ర్ క‌దంబ మృతి

హైద‌రాబాద్ : హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ (ఎన్‌జెడ్‌పీ)లోని రాయల్ బెంగాల్ పులి మృతి చెందింది. క‌దంబ అనే 11 ఏళ్ల మ‌గ పులి శ‌నివారం రాత్రి గుండె వైఫ‌ల్యంతో మృతి చెందిన‌ట్లు జూ అధికారులు ఆదివారం తెలిపారు. ప్రస్తుతం  మొత్తం 20  రాయల్‌ బెంగాల్‌ టైగర్లున్నాయి. వాటిలో పసుపు రంగువి 11 (పెద్దవి–8, చిన్నవి–3), తెలుపు రంగువి 9 ( పెద్దవి) ఉన్నాయని పార్క్ క్యూరేట‌ర్ క్షితిజ తెలిపారు. వీటిల్లో మూడు రాయల్ బెంగాల్ టైగర్స్ (పసుపు) రోజా (21), సోని (20), అపర్ణ (19) ఇప్పటికే సగటు జీవితకాలాన్నిఅధిగ‌మించాయ‌ని పేర్కొన్నారు. కాగా, కర్ణాటకలోని మంగళూరు పిలుకుల బయోలాజికల్‌ పార్కు నుంచి జంతువుల మార్పిడి పథకం కింద కదంబను 2014  మార్చి 3న నెహ్రూ జూకు తీసుకొచ్చారు. కాగా, క‌దంబ ఎలాంటి వ్యాధి ల‌క్ష‌ణాలు క‌నిపించ‌లేద‌ని, అయితే గ‌త కొంత‌కాలంగా త‌ర‌చూ మేత‌కు దూరంగా ఉంద‌ని, జూ ప‌శువైద్యుల ప‌రిశీల‌న‌లో ఉంద‌ని పేర్కొన్నారు. అవసరమైన రక్తం, కణజాల నమూనాలను సేకరించి హైద‌రాబాద్ రాజేంద్ర‌న‌గ‌ర్‌లోని కాలేజ్ ఆఫ్ వెట‌ర్న‌రీ సైన్స్‌, శాంతిన‌గ‌ర్ వెట‌ర్న‌రీ బ‌యోలాజిక‌ల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌తో పాటు అట్టాపూర్‌లోని లాకోన్స్ సీసీఎంబీకి పంపిన‌ట్లు క్షితిజా వివ‌రించారు. జూన్ 25 రాయల్‌ బెంగాల్‌ వైట్‌ టైగర్ ‌(కిరణ-8) కుడివైపు దవడ భాగంలో ఏర్పడిన న్యూయో ప్లాస్టిక్‌ కణతితో బాధపడుతూ మృతి చెందింది.


logo