ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 05, 2020 , 17:18:36

హైదరాబాద్‌ జూలో రాయల్ బెంగాల్ టైగర్ మృతి

హైదరాబాద్‌ జూలో రాయల్ బెంగాల్ టైగర్ మృతి

హైదరాబాద్: నెహ్రూ జవలాజికల్‌ పార్కులో రాయల్ బెంగాల్ టైగర్ కదంబ శనివారం రాత్రి మరణించింది. దీని వయసు 11 సంవత్సరాలు. ఈ మగ పులికి ఎలాంటి అరోగ్య సమస్యలు కనిపించలేదని, అయితే గత కొన్ని రోజులుగా ఆహారం ముట్టకుండా ఉంటున్నదని జూ అధికారి ఒకరు చెప్పారు. కదంబకు పోస్ట్‌మార్టం నిర్వహించి దాని మరణానికి గల కారణాలను పరిశోధకులు అన్వేషిస్తున్నారు. 

రాజేంద్రనగర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, పాథాలజీ విభాగం హెడ్ ప్రొఫెసర్ లక్ష్మణ్ నేతృత్వంలోని నిపుణుల బృందం ఆదివారం పోస్టుమార్టం నిర్వహించింది. శాంతినగర్ వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (వీబీఆర్ఐ) అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ దేవేందర్, డాక్టర్ విజయ్ భాస్కర్‌రెడ్డి, లాకోన్స్- సీసీఎంబీ సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ సదానంద్ సోంటక్కే, జూ కన్సల్టెంట్, డిప్యూటీ డైరెక్టర్ (రిటైర్డ్) డాక్టర్ ఎం. నవీన్ కుమార్, హైదరాబాద్ జూపార్క్ జూ పశువైద్యులు, జూ పార్క్స్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్‌ ఎంఏ హకీంతోపాటు తెలంగాణ జూపార్క్స్‌ డైరెక్టర్‌, క్యురేటర్ సమక్షంలో పోస్ట్‌మార్టం జరిగింది.

మరింత వివరణాత్మకమైన పరిశీలన నిమిత్తం అవసరమైన రక్త, కణజాల నమూనాలను సేకరించి రాజేంద్రనగర్‌ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, శాంతినగర్‌లోని హైదరాబాద్ వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, అత్తాపూర్ లోని లాకోన్స్-సీసీఎంబీకి పంపినట్లు జూ అధికారులు తెలిపారు.

జంతువుల మార్పిడి కార్యక్రమంలో భాగంగా 2014 మార్చిలో కర్ణాటక మంగుళూరులోని పిలుకుల బయోలాజికల్ పార్క్ నుంచి కదంబను ఇక్కడికి తీసుకువచ్చారు. కదంబ మరణంతో హైదరాబాద్‌ జూపార్కులో 8 పెద్దవి, 3 పిల్లలతో మొత్తం 11 రాయల్ బెంగాల్ టైగర్స్ (పసుపు), 9 రాయల్ బెంగాల్ టైగర్స్ (తెలుపు) పెద్దవి ఉన్నాయి. పది రోజుల వ్యవధిలో జూలో పులి చనిపోవడం ఇది రెండవది. జూన్ 25 న కిరణ్ అనే 8 ఏండ్ల వయసున్న మగ తెల్ల పులి నియోప్లాస్టిక్ కణితి కారణంగా మరణించింది.


logo