శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 28, 2020 , 01:52:18

బీజేపీ శ్రేణుల్లో నిర్వేదం

బీజేపీ శ్రేణుల్లో నిర్వేదం

  • కొంపముంచిన సోషల్‌మీడియా
  • అత్యుత్సాహంతో పార్టీకి నష్టం
  • నెత్తి పట్టుకుంటున్న కాషాయ నేతలు

సిద్దిపేట, నమస్తే తెలంగాణ: అన్నీ తప్పటడుగులే. గెలవడం కోసం వేస్తున్న ఎత్తుగడలే. ఒక్కటి కాదు.. రెండు కాదు.. వరుస ఘటనలు బీజేపీ పరువును బజారుకీడుస్తున్నాయి. కావాలని చేసిన ఆరోపణలు విఫలం అవుతుంటే ప్రజల్లో ఆ పార్టీ చులకన అవుతున్నది. ముఖ్యంగా సోషల్‌మీడియాలో చేస్తున్న ప్రచారం బెడిసికొట్టి, గిలగిలా కొట్టుకుంటున్నది. సోషల్‌మీడియాను నమ్ముకొంటే కొంపలు ముంచవట్టే అంటూ బీజేపీ శ్రేణులే తలలు పట్టుకుంటున్నాయి. సోమవారం సిద్దిపేటలో జరిగిన ఘటనతో ఆ పార్టీ నాయకులు విస్తుపోయారు. తమ పార్టీ అభ్యర్థి బంధువుల ఇంట్లో దొరికిన డబ్బులు తమవి కావంటూ చెప్పుకోవడం సిగ్గు అనిపిస్తున్నది అంటూ పలువురు కరుడుగట్టిన బీజేపీ నాయకులు చెప్తున్నారు. బీజేపీ పరువు మంట కలిసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం రెండో స్థానం దక్కుతుందా? డిపాజిటైనా వస్తుందా? అంటూ ఆ పార్టీ శ్రేణుల్లో నిర్వేదం నెలకొంది. బీజేపీలో మొదటి నుంచి పని చేసిన క్రియాశీలక కార్యకర్తలు కూడా అభ్యర్థి నచ్చక పెద్దసంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ‘రేపు పొద్దుగాల ఎన్నికలు అయ్యాక ఒక్క కార్యకర్తకు కూడా రఘునందన్‌రావు అందుబాటులో ఉండరు.. అతనికి మేం ఎలా ఓటు వేస్తాం’ అంటు బీజేపీ కార్యకర్తలే మాట్లాడుకోవడం కొసమెరుపు.

ఓడిపోతామనే ఆగం అవుతుర్రు

ఓట్లు అన్నాక ఒకడు గెలుసుడు, ఉంకోడు ఓడుడు ఉంటది. 2001 నుండి చూస్తున్నాం తెలంగాణ తెస్తామని, తెలంగాణ వస్తేనే బాగుపడ్తామని కేసీఆర్‌ సార్‌ చెప్పిండు. తెలంగాణ తెచ్చిండు. దుబ్బాక ప్రజల్లో టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ మాత్రమే ఉన్నరు. కాంగ్రెస్‌, బీజేపీకి పబ్లిక్‌ ఓట్లు వేయరు. ఓడిపోతామనేవాల్లు ఏశాలు ఏస్తున్నారు.

-వీరారెడ్డిపల్లి నర్సింహులు, రైతు, వెంకట్‌రావుపేట(తొగుట మండలం)

కుట్రలతో ఓట్లు పడయ్‌

దొంగనే దొంగ దొంగ అని అరిస్తే తప్పించుకుంటారన్న భ్రమలో బీజేపీ నాయకులు ఉన్నరు. మా దుబ్బాకలో ఓట్లు కొత్త కావు. 2001 నుండి స్థానిక, ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు కారు గుర్తుకే పట్టం కడుతున్నరు. సిద్దిపేటలో బీజేపీ నాయకుల డబ్బును పోలీసులు పట్టుకున్నరు. వాటిని గుంజుకొని డ్రామా చేసి బొక్క బోర్లా పడ్డరు.

-మంతూరి రమేశ్‌, రైతు, ఎల్‌ బంజేరుపల్లి(తొగుట మండలం)