శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 29, 2020 , 21:46:45

సెక్టోర‌ల్ అధికారుల పాత్ర చాలా కీల‌కం : భార‌తి హోళ్లికేరి

సెక్టోర‌ల్ అధికారుల పాత్ర చాలా కీల‌కం : భార‌తి హోళ్లికేరి

సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికల్లో సెక్టోరల్‌ అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, సెక్టోరల్ అధికారుల పాత్ర చాలా కీలకమని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి భారతి హోళ్లికేరి అన్నారు. సిద్ధిపేట కలెక్టరెట్‌లో సెక్టోరల్‌ అధికారులతో గురువారం సాయంత్రం దుబ్బాక ఉప ఎన్నికల నిర్వహణపై క‌లెక్ట‌ర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. సెక్టోరల్‌ అధికారులు త‌మ‌కు కేటాయించిన రూట్‌లలో పోలింగ్‌ కేంద్రాలను పర్యవేక్షించాలని సూచించారు. పోలింగ్ బూత్ వారీగా సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల జాబితా సెక్టోరల్ అధికారుల దగ్గర తప్పనిసరిగా ఉండాలన్నారు. పోలింగ్‌ కేంద్రాలకు ఏర్పాటు చేసిన రూట్‌లలో ఓటర్లు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని సూచించారు. పోలింగ్ ఏజెంట్ల కదలికలపై నిఘా ఉంచాల‌న్నారు. పోలింగ్‌ కేంద్రం పరిధిలో కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు.  

ఎన్నికల నిబంధనల మేరకు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా, బెదిరింపులకు పాల్పడడం లాంటి చర్యలను పోలీసులతో కలిసి అరికట్టాలన్నారు. మాక్‌ పోల్‌ స్థితిని 30 నిమిషాల్లోపు రిటర్నింగ్‌ అధికారికి అందించాలన్నారు. సమస్యలు తలెత్తితే రిటర్నింగ్‌ అధికారికి సమాచారం అంద‌జేయ‌ల‌న్నారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత ప్రిసైడింగ్‌ అధికారుల డైరీ సక్రమంగా పూరించాలన్నారు. ఈవీఎంలను పూర్తి స్థాయిలో సీల్‌ చేయాలన్నారు. ఈ స‌మావేశంలో ట్రైనీ కలెక్టర్ దీపక్ తివారీ, సిద్ధిపేట ఆర్డీఓ అనంతరెడ్డి, సెక్టోరల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.